హాస్టళ్ల కార్యాలయంలో కొనసాగిన విచారణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం యూనివర్సిటీ అధికారులు నియమించిన విచారణ కమిటీ చైర్మన్ ఆచార్య ప్రసాద్, ఇతర సభ్యులతో కూడిన కమిటీ బుధవారం విచారణ జరిపినట్లు సమాచారం. హాస్టళ్ల కామన్ మెస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక మెస్ బిల్లులు వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. గత పది నెలల మెస్‌బిల్లులను విచారణ కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే ఆయా బిల్లులను విచారణ కమిటీ.. హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలోని ఓ బీరువాలో పెట్టి సీజ్ చేశారు. వాటిని పరిశీలించాల్సింటుంది. బుధవారం హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో కమిటీ విచారణ సందర్భంగా పలువురు విద్యార్థులు అక్కడికి చేరుకుని పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. అదేవిధంగా కార్యాలయంలోని ఓ కంప్యూటర్ పనిచేయకపోవడంపై ఆరా తీసినట్లు సమాచారం. సంబంధిత కంప్యూటర్‌పై విధులు నిర్వర్తించే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని విచారణ కమిటీ ప్రశ్నించగా గత ఆగస్టులోనే కాలిపోయిందని, అప్పటినుంచి పనిచేయడం లేదని తెలిపినట్లు తెలిసింది. అందులో ఉండే డేటా గురించి కమిటీ అడిగినట్లు సమాచారం. మెస్‌లో నిర్వహణకు సంబంధించి అడ్వాన్స్‌లు (డబ్బులు) తీసుకున్న ఓ జాయింట్ డైరెక్టర్‌ను కూడా పిలిపించి ఎన్ని అడ్వాన్స్‌లు తీసుకున్నారు.. అందులో దేనికి ఎంత ఖర్చు చేశారని, ఆయా బిల్లులు సెటిల్ చేశారా అని ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. గురువారం కూడా విచారణ కొనసాగనుంది.


