శ్వేతార్కుడికి చిత్రాన్నపూజ
కాజీపేట : కాజీపేటలోని స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామివారికి మంగళవారం రాత్రి పులిహోరతో చిత్రాన్నపూజ నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి హరిస్వామి పంచామృత, పంచ వర్ణాభిషేకాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తీసుకువచ్చిన పులిహోరను రాశిలా పోసి పౌష్యలక్ష్మి, అన్నపూర్ణదేవతల ఆహ్వాన పూజలు జరిపించారు.
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో మంగళవారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో వేదపండితులు దేవాలయంలోని కాకతీయుల కాలంనాటి ఉత్తిష్ట గణపతికి జలాభిషేకం క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలు, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు.
ఎంజీఎం: ప్రజలకు 108 సేవలు ఎల్లప్పుడూ చేరువలో ఉంటాయని 108 సర్వీస్ వరంగల్ జిల్లా మేనేజర్ గుర్రపు భరత్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, శ్వాస సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, కడుపు నొప్పి, ప్రసవనొప్పులు, జ్వరాల వంటి సందర్భాల్లో తమ సిబ్బంది అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో 108 సేవల ద్వారా మెడికల్ 37,681, ప్రసవ సంబంధిత కేసులు 3,303, ట్రామా వెహికులర్ 4,259, శ్వాస సంబంధిత సమస్యలు 2,430, గుండె సంబంధిత 2,165 కేసులు నమోదైనట్లు వివరించారు.
హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్..రామచందర్‌రావు ఈ నెల 8న హనుమకొండ జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తెలిపారు. మంగళవారం హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఆయన పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారని, పార్టీ పటిష్టత, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రావుల కిషన్, డాక్టర్ పెసరు విజయ్‌చందర్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, జయంత్‌లాల్, దొంతి దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు సీతక్క, సురేఖతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.


