ఆస్తి పన్ను జరిమానా సవరణ
వరంగల్ అర్బన్: ఆస్తిపన్ను కొలతల్లో తేడాలపై విధించిన 25 శాతం జరిమానాలు రద్దు కానున్నాయి. లక్షల రూపాయల జరిమానాలతో మూడేళ్లుగా సతమతమవుతున్న ఇళ్ల యజమానులకు ఉపశమనం లభించనుంది. ఇందుకోసం ఆస్తిపన్ను సవరణకు బకాయిదారులు కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో రివిజన్ పిటిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం పురపాలక శాఖ నూతన చట్టం–2019 అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త భవన, ఇంటి నంబర్ల కోసం స్వీయ ధ్రువీకరణతో పురపాలకశాఖ వెబ్‌సైట్‌లో నమోదు విధానాన్ని ప్రవేశపెట్టింది. చట్టం అమలుపై బల్దియా రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. ప్రజలకు అవగాహన కల్పించలేదు. పాత పద్ధతిలో భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను ప్లింత్ ఏరియా మేరకు మదింపు చేశారు. ‘ఆన్‌లైన్’లో నమోదు చేసిన భవనం విస్తీర్ణం, ప్లింత్ ఏరియా, ఓపెన్ ప్లేస్ కొలతల్లో తేడాలు వచ్చాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర పురపాలక అదనంగా 25 శాతం పెనాల్టీ విధించింది. డిమాండ్ నోటీసులను పరిశీలించిన భవన యజమానులు ఆస్తి పన్ను చూసి లబోదిబోమన్నారు. బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఎమ్మెల్యేలు, రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు నెల రోజుల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీకే శ్రీదేవి 25 శాతం పెనాల్టీ రద్దుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించి ప్రత్యేక ప్రొఫార్మా తయారీ చేయించి, అమలు కోసం రెవెన్యూ విభాగం అధికారులకు సూచనలు చేశారు. ఇక టౌన్‌ప్లానింగ్‌లో నూతన భవన నిర్మాణ అనుమతుల కోసం స్వీయ దరఖాస్తులపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.
వాస్తవ పన్ను చెల్లిస్తేనే..
నగర వ్యాప్తంగా 25 శాతం జరిమానాలు నమోదైన నివాస, వాణిజ్య భవనాలు 3,405 వరకు ఉన్నాయి. ఆ భవనాల నుంచి ఆస్తి పన్ను రూ.6 కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయి. సర్కిల్ కార్యాలయాల్లో ఆస్తి పన్ను సవరణ కోసం రివిజన్ పిటిషన్ అందజేయాలి. దీంతో ఆయా ప్రాంతాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు దరఖాస్తులు, స్థల డాక్యుమెంట్లు, అనుమతి పత్రాలు, డిమాండ్ నోటీసులను పరిశీలిస్తారు. ఆస్తిపన్ను కోసం ప్లింత్‌్ ఏరియాల కొలతలు తీసుకుంటారు. దీని ఆధారంగా కొత్త డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. డిమాండ్ నోటీసుల సొమ్ము చెల్లిస్తే 25 శాతం జరిమానా రద్దు కానుంది. దీంతో బల్దియాకు ఆస్తి పన్ను బకాయిలు వసూలు కానున్నాయి.
సద్వినియోగం చేసుకోవాలి..
25 శాతం ఆస్తి పన్ను పెనాల్టీ రద్దుకు రివిజన్ పిటిషన్ తప్పనిసరిగా అందించాలి. వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని జారీ చేసిన డిమాండ్ నోటీసుల ఆధారంగా ఆస్తి పన్ను చెల్లిస్తే 25 శాతం జరిమానా రద్దువుతుంది. లేకుంటే జరిమానా అలాగే ఉండడం, బకాయిలు పేరుకుపోతే పురపాలక శాఖ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయి. అందువల్ల ఈ అవకాశాన్ని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలి. – ప్రసున్నారాణి,
బల్దియా కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్
రివిజన్ పిటిషన్ సమర్పిస్తే వర్తింపు
ఎట్టకేలకు బకాయిదారులకు
ఉపశమనం


