విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలి
హన్మకొండ: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని, ఈ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఇంగ్లిష్ ఎన్రిచ్‌మెంట్ ప్రోగ్రాం గురించి తెలుసుకున్నారు. ఆంగ్లం, హిందీ, తెలుగు భాషలో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు ఆంగ్ల భాషలో ఆశించిన స్థాయిలో ప్రావీణ్యం చూపకపోవడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష బోధనను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలని, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులతో ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని కలెక్టర్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనం, వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. వంట సామగ్రిని తనిఖీ చేశారు. మెనూ కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజుగౌడ్, ఎంఈఓ నెహ్రూ, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పరకాల ఓటర్ల ముసాయిదాపై సమీక్ష
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లో మంగళవారం రాత్రి పరకాల మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదాపై కలెక్టర్ స్నేహశబరీష్.. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8లోగా స్వీకరించాలని కోరారు. జిల్లా అదనపు కలెక్టర్ రవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, పరకాల కమిషనర్ అంజయ్య, పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్ రావు, రావు అమరేందర్‌రెడ్డి, శనిగరపు రాజు, గట్టు ప్రభాకర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, నాగవెళ్లి రజనీకాంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ కేంద్రాలపై నిఘా ఉంచాలి
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా ఉంచడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రాత్రి పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది జననాల్లో లింగ నివృత్తి, అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై సమీక్షించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, ఈవీ శ్రీనివాస్ రావు, ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ జయంతి, డాక్టర్ నవీన్, రుబీనా పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్


