రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
రామన్నపేట: ఒక్క క్షణం అజాగ్రత్త, నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదానికి కారణమై ప్రాణం తీస్తుందని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ అధికారుల సమన్వయంతో మంగళవారం పోచమ్మమైదాన్ కూడలిలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన అత్యంత ముఖ్యమైన అంశమని, రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం లాంటివి ట్రాఫిక్ ఉల్లంఘనలేనని తెలిపారు. రోడ్డు నియమాలు మీ ప్రాణాలు, మీ కుటుంబ భవిష్యత్ కాపాడేందుకు రూపొందించినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ రూపొందించిన ట్రాఫిక్ నియమాల పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. పోచమ్మమైదాన్ కూడలి వద్ద హెల్మెట్ ధరించిన వాహనదారులకు న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, ఏఎస్పీ శుభం, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, ఎంవీఐ జయపాల్‌రెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ


