ఎస్‌ఐఆర్‌ను వేగంగా పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను నిర్ణీత గడువులోగా వేగంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులు, బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చే (మ్యాపింగ్) ప్రక్రియను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ గురించి అధికారులు, బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించి జాబితాను సరిచేయాలని సూచించిన కలెక్టర్, 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఎన్నికల కమిషన్ నిబంధనలను బీఎల్‌ఓలకు వివరించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఇతర అధికారులు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.


