సీజనల్ పూలమొక్కలు నాటాలి
హన్మకొండ/వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరంలోని పార్కుల్లో సీజనల్ పూల మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఉద్యాన అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్, బాలసముద్రంలోని ఏకశిల పార్కులను ఆమె శుక్రవారం సందర్శించారు. శీతాకాలం దృష్ట్యా సీజన్‌లో పూల మొక్కలను నాటడం వల్ల పార్క్‌లు ఆహ్లాదకరంగా ఉంటాయన్నారు. పార్కులు పరిశుభ్రంగా ఉండేలా శుభ్రం చేయాలని, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాలిపోయిన, ఎండి పోయిన ఆకుల వ్యర్థాలు చెత్తాచెదారం బయో మాన్యూర్‌గా ఉపయోగపడుతుందని, ఈ వ్యర్థాలను బాల సముద్రంలోని బయోగ్యాస్ ప్లాంట్‌కు తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ రమేశ్, హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రవళిక పాల్గొన్నారు. కాగా, పార్కులో కమిషనర్ ఎదుట శునకాలు సంచరించాయి. పార్కుల్లో శునకాలు తిరగడం పిల్లలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రజలు సంచరించే ప్రాంతాల్లో కుక్కలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించినా వరంగల్ మహానగరంలోని పార్కుల్లో కుక్కలు యథేచ్ఛగా తిరుగుతుండడం గమనార్హం.
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
నగరంలోని పార్కుల పరిశీలన


