
రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలి
వెంకటాపురం(ఎం): కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ప్రపంచస్థాయిలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని మాజీ డీజీపీ రతన్ వలంటీర్లకు పిలుపునిచ్చారు. రామప్పలో పది రోజులుగా జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపు శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్ పాండురంగారావు అధ్యక్షత వహించగా మాజీ డీజీపీ రతన్‌తోపాటు రాష్ట్ర ఆర్కియాలజికల్ అండ్ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 35 మంది, ఇరాన్ నుంచి ముగ్గురు వచ్చి శిక్షణ తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుందన్నారు. 13వ శతాబ్దంలో కాకతీయులు రామప్ప ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంతోనే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందన్నారు. అనంతరం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరపున వలంటీర్లకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ జనగాం శ్రీధర్‌రావు, ఆసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, గైడ్‌లు గోరంట్ల విజయ్‌కుమార్, తాడబోయిన వెంకటేష్, యోగా గురువు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
మాజీ డీజీపీ రతన్
రామప్పలో ముగిసిన వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంప్