
బాణసంచా వ్యాపారంలో భద్రత పాటించాలి
వరంగల్ క్రైం : బాణసంచా విక్రయ సమయాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని బాణాసంచా విక్రయదారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. బాణాసంచా విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, అ నుమతుల కోసం వ్యాపారస్తులు ముందుగా అగ్నిమాప క విభాగం అధికారుల నుంచి ఎన్‌ఓసీ పొందాలన్నారు. అలాగే వ్యాపారస్తులు స్థల యజమాని నుంచి అనుమతి పత్రాన్ని పొందాలన్నారు. రూ.800 ప్రభుత్వ బ్యాంక్ చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విక్రయాలు జరిపే ప్రదేశంలో అగ్ని ప్రమాద నివారణకు వినియోగించే ఇసుక, నీరు, ఇతర అగ్ని ప్రమాద నిరోధక సాధనాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పెద్దలు పిల్లల వద్ద ఉండాలన్నారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారులు సుదర్శన్ రెడ్డి, రేమాండ్ బాబు, శ్రీధర్ రెడ్డి, అదనపు డీసీపీ రవి, ఏఎస్పీ శుభం, ఏసీపీ జితేందర్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నర్సింహారావులు, ఇన్‌స్పెక్టర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్