
మత్స్యశాఖకు దిక్కెవరు?
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ, వరంగల్ జిల్లాల మత్స్యశాఖ కార్యాలయాలకు పెద్ద దిక్కు కరువైంది. సుమారు ఏడాదిన్నర క్రితం హనుమకొండ డీఎఫ్‌ఓ డాక్టర్ విజయభారతి బదిలీ కావడంతో ఆ సీటు ఖాళీ అయిపోయింది. వరంగల్ డీఎఫ్‌ఓ నరేశ్‌నాయుడు బదిలీ కాగా, ఆయన స్థానంలో నాగమణి బాధ్యతలు చేపట్టారు. కాగా, హనుమకొండ ఖాళీగా ఉండడంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులు నాగమణికి ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ బాధ్యతలను అప్పగించారు. ఏడాదిన్నరగా రెండు జిల్లాల అధికారిగా కొనసాగుతున్న నాగమణి తాజాగా ఏసీబీ కేసులో అరెస్ట్ కావడంతో రెండు జిల్లాలకు అధికారులు లేకుండా పోయారు.
ఉచిత చేప పిల్లల పంపిణీ ఎలా?
ఏటా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ ఇప్పటికే ఆలస్యమైంది. గత నెల వరంగల్, హనుమకొండ జిల్లాలకు టెండర్లను ఆహ్వానించగా, బిడ్లు కూడా ఖరారైనట్లు ఇటీవల నాగమణి వెల్లడించారు. ఇప్పుడు ఆమె అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో చేప పిల్లల పంపిణీపై ప్రభావం పడే అవకాశాలున్నాయని పలువురు మత్స్య సహకార సొసైటీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న హరీశ్
వరంగల్ ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఈఏడాది ఆగస్టు 15న వరంగల్ కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవా ర్డు అందుకున్నారు. ఆ ఉత్తమ ఉద్యోగి శుక్రవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధి కారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డీఎఫ్‌ఓ నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ ఏడాదిన్నరగా అవకాశం ఉన్న ప్రతీ అంశంలో అవినీతికి పాల్పడుతున్నారని మత్స్యశాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. లంచాల కోసం ప్రతి ఒక్కరినీ పీడించే వార ని బాహాటంగానే మాట్లాడుకోవడం వినిపించింది.
ఏడాదిన్నర క్రితం
హనుమకొండ డీఎఫ్‌ఓ బదిలీ
ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓగా నాగమణి
ఏసీబీకి చిక్కడంతో
రెండు జిల్లాలు ఖాళీ