
భక్తసేవాశ్రమంలో క్యూలైన్ల ఏర్పాటు
హన్మకొండ కల్చరల్: వరంగల్ భద్రకాళి రోడ్డులోని శ్రీధర్మశాస్తా అయ్యప్పస్వామి భక్తసేవాశ్రమంలో ఈనెల 22 నుంచి అయ్యప్ప దీక్షలు ప్రారంభం కానున్నట్లు అర్చకుడు గణపతిశర్మ తెలిపారు. కార్తీకమాసం సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకుడు, గురుస్వామి టీఆర్ బాలస్రుబహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈనెల 18న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. భవానీనగర్, గోకుల్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీ, సుమంగళి ఫంక్షన్‌హాల్, అశోకా కాలనీ, విద్యానగర్, రాంనగర్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, ప్రకాశ్‌రెడ్డిపేట, పోస్టల్ కాలనీ, ఎఫ్‌సీఐ కాలనీ, విద్యుత్‌నగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, నయీంనగర్ మాతాబార్, తోటబడి బ్యాక్ సైడ్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, కొత్తూరు మార్కెట్, కుమార్‌పల్లి, తోటబడి బ్యాక్‌సైడ్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అదేవిధంగా సోమిడి, వెస్ట్‌సిటీ సబ్‌స్టేషన్ ప్రాంతంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరంగల్‌లో..
వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని ఎన్పీడీసీఎల్ వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. అబ్బనికుంట, ఎస్‌ఆర్‌టీ, టీఆర్టీ కాలనీ, యాకూబ్‌పుర, లేబర్ కాలనీ, 100 ఫీట్ల రోడ్డు, నర్సంపేట రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని యార్డులు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతీరోజు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌ను మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు ఉప్పుల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన ఆయన యార్డులను సందర్శించారు. పత్తి యార్డులో కొంత అపరిశుభ్రంగా ఉండడంతో సంబంధిత కాంట్రాక్టర్‌ను పిలిపించి మాట్లాడారు. యార్డులు శుభ్రంగా ఉండాలని సూచించారు. అనంతరం ఆయన పత్తిలో నాణ్యత, తేమ శాతం ఎంతవరకు ఉందని పర్యవేక్షకులను అడిగి తెలసుకున్నారు. రైతులు, వ్యాపారులు, మార్కెట్ సిబ్బంది, కార్మికులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. పత్తి యార్డులో అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రేడ్–2 కార్యదర్శులు ఎస్.రాము, జి.అంజిత్‌రావు, సహాయ కార్యదర్శి జి.రాజేందర్, మార్కెట్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు శుక్రవారం రాత్రి 9:35 గంటలకు 895 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకు 1,435 దరఖాస్తులు వచ్చాయి. కాగా, శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. గత టెండర్లలో 5,859 దరఖాస్తులకు రూ.117 కోట్ల ఆదాయం ఎక్సైజ్ ఖజానాకు వచ్చింది. 2025–27 సంవత్సరం టెండర్ల ప్రక్రియలో గత టార్గెట్ చేరుకుంటుందా లేదా? ప్రభుత్వం దరఖాస్తుల గడువు పొడిగిస్తుందా? అని వేచి చూడాలి.