
నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడి మెడపై కత్తితో దాడి
కేసముద్రం: ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ ఆరేళ్ల బాలుడి మెడపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీష దంపతులకు మనీష్, మోక్షిత్ ఇద్దరు కుమారులున్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులైన ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, నానమ్మ (మంగమ్మ) పక్కన పడుకున్న మనీష్ అనే ఆరేళ్ల బాలుడి మెడకు ఒకవైపు, వీపుభాగంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. దీంతో ఆ బాలుడు ఏడుస్తుండగా నిద్రలేచిన మంగమ్మ తన మనుమడిని దగ్గరకు తీసుకుని చూసింది. మనీష్ మెడభాగంపై గాయమై తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో కేకలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, చుట్టుపక్కలున్న వారు నిద్రలేచి మనీష్‌ను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మెడపై కత్తిగాటుతో పొడవుగా పడటంతో 8 కుట్లు పడ్డాయి. కాగా, ఇంటికి రెండు దర్వాజలు ఉండగా, ఒక దర్వాజ తలుపులకు బేడం లేదని, దీంతో ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ట్రైనీ ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్ సీఐ సర్వయ్య మానుకోట జనరల్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపేందర్, శిరీష దంపతుల చిన్నకుమారుడైన నిహన్ (యేడాదిన్నర బాలుడు) 7 నెలల క్రితం నీటిసంపులో పడి మృతిచెందాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మనీష్‌ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.
మెడభాగంలో కోసిన
గుర్తుతెలియని వ్యక్తులు
తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలింపు
మహబూబాబాద్ జిల్లాలో ఘటన

నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడి మెడపై కత్తితో దాడి