ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లి
రామన్నపేట : వరంగల్ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం గురువారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌కు చెందిన డాక్టర్ అశోక్, సునీత దంపతుల కుమారుడు రితేశ్, అమెరికాలోని పీట్స్‌బర్గ్‌కు చెందిన జూలియాన్ మనస్సులు కలవడంతో పెద్దలను ఒప్పించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అమెరికా అమ్మాయి అయినా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడంపై అతిథులు ఆనందం వ్యక్తం చేశారు.
వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి
కాజీపేట రూరల్: జిల్లాలో హెల్త్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, బలరాంనాయక్‌ను గురువారం కలిసి వినతి పత్రాలు అందజేశారు. గతేడాది కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, వరంగల్‌కు రెండు వెల్‌నెస్ సెంటర్లు మంజూరైనట్లు తెలిపారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత సదానందం తెలిపారు.
డీఈఓకు సన్మానం
విద్యారణ్యపురి : న్యాస్ (పరాక్)లో హనుమకొండ జిల్లాను ఉత్తమస్థానంలో నిలిపినందున జూలై 30వ తేదీన హైదరాబాద్‌లో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన జిల్లాల విద్యాశాఖాధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారురు కె.కేశవరావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగి తారాణా.. డీఈఓ వాసంతిని సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.
కేయూ ఇన్‌చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా హబీబుద్దీన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ మహ్మద్ హబీబుద్దీన్ నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఫైనాన్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తోట రాజయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఇన్‌చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా హబీబుద్దీన్‌కు బాధ్యతలు అప్పగించారు. హబీబుద్దీన్ కేయూలో 1988లో చిరు ఉద్యోగిగా చేరి అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగం చేసుకుంటూనే సోషియాలజీలో డాక్టరేట్ పొందారు. నేడు (శుక్రవారం) రిజిస్ట్రార్ హబీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి