
మాకు న్యాయం చేయాలి..
● మృతుడి కుటుంబ సభ్యుల డిమాండ్
● మృతదేహంతో కారు యజమాని ఇంటి ఎదుట ఆందోళన
సంగెం: తమకు న్యాయం చేయాలని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ యువకుడి మృతికి కారణమైన కారు యజమాని ఇంటి ఎదుట మృతదేహం ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన సోమవారం సంగెం మండలం కాపులకనిపర్తిలో జరిగింది. హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన తోట రాజు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న ఖిలావరంగల్ మండలం నక్కలపల్లిలో ఓ రోగికి డ్రెస్సింగ్ చేసి బైక్‌పై హనుమకొండ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కాపులకనిపర్తికి చెందిన కొండేటి ధనుశ్ వెనక నుంచి కారుతో ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాజును హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రాజు మృతికి కారణమైన ధనుశ్ స్వగ్రామం కాపులకనిపర్తిలోని తన ఇంటి ఎదుట మృతదేహం ఉంచి ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పర్వతగిరి సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో సంగెం, పర్వతగిరి, ఐనవోలు, మమునూరు ఎస్సైలు ఘటనా స్థలికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.