
ఉచిత చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలి
హన్మకొండ చౌరస్తా: జల వనరులకు సరిపడేంత ఉచిత చేప పిల్లలకు బదులు మత్స్య సొసైటీల ఖాతాల్లో నగదు జమ చేయాలని తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్. బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీఓఎస్ భవన్‌లో గురువారం టీఎంకేఎంకేఎస్ జిల్లా అద్యక్షుడు నిమ్మల విజేందర్, దువ్వ సువర్ణ అధ్యక్షతన సంఘం రెండో మహాసభలు జరిగాయి. ముందుగా మత్స్యకార్మిక సంఘం జెండాను సీనియర్ నాయకురాలు దువ్వ సమ్మక్క ఆవిష్కరించి, జాతీయ నాయకుడు కరుణామూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీలో ప్రకటన చేయకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్, ఎం.చుక్కయ్య, లింగయ్య, రమేశ్, రవి, సమ్మయ్య, పవన్‌కళ్యాణ్, ఐలయ్య, సమ్మక్క, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.