
ఎకోటూరిజం అభివృద్ధికి అడుగులు?
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం శివారులోని ఇనుపరాతి గుట్టలను శనివారం పీసీసీఎఫ్( ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్) సువర్ణ, హైదరాబాద్ జూ పార్కు సీసీఎఫ్ సునీల్ కుమార్, వరంగల్, హనుమకొండ డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, భద్రాద్రి సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ కృష్ణమాచారి సందర్శించారు. ఈ సందర్భంగా ఇనుపరాతి గుట్టల ప్రాంతంలో అటవీ శాఖకు సంబంధించిన భూముల వివరాలు తెలుసుకున్నారు. గతంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ హామీలో భాగంగా జూ పార్కు తరలింపు, ఎకోటూరిజం ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లు సమాచారం. హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్క తుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్టలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సిబ్బందికి సూచించినట్లు సమాచారం. కాగా, దేవునూరు శివారులో ఎకో టూరిజం ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయా గ్రామాల ప్రజల ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భిక్షపతి, డీఆర్‌ఓ మోహన్ లాల్, బీట్ ఆఫీసర్ రతన్ లాల్, కొత్తగూడెం రేంజ్ డీఎఫ్‌ఓ కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
● ఇనుపరాతి గుట్టలను సందర్శించిన పీసీసీఎఫ్