
క్రీడాకారుల శిక్షణపై దృష్టి సారించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోచ్‌లకు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియం నిర్వహణ, స్విమ్మింగ్‌పూల్ అభివృద్ధి పనులు, ఎంజీఎం ఆవరణలోని మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను క్షేత్రస్థాయిలో శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇండోర్ స్టేడియాన్ని సందర్శించి షటిల్ కోర్టులు, జిమ్ సెంటర్, టేబుల్ టెన్నిస్ కోర్టులను పరిశీలించి, శిక్షణ తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కోచ్‌లను నియమించుకొని క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంజీఎం ఆవరణలో 750 కేఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని (ఎస్‌టీపీ) పరిశీలించారు. ప్లానిటోరియంలో కొనసాగుతున్న పునరుద్ధరణ, సుందరీకరణ పనులను పర్యవేక్షించారు. తనిఖీల్లో డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, డీఈలు రాజ్‌కుమార్, రాగి శ్రీకాంత్, ఏఈ హబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.