
డివిజన్‌కు ముగ్గురు!
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రజారోగ్య విభాగంలో శానిటరీ జవాన్లను ఇష్టారీతిన నియమిస్తున్నారు. మితిమీరిన ప్రజాప్రతినిధుల పైరవీలు, ఆమ్యామ్యాలిచ్చి రాత్రికి రాత్రే కార్మికులు.. జవాన్లుగా మారిపోతున్నారు. నగరవ్యాప్తంగా జవాన్లు మినహా 2,619 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతీ డివిజన్‌లో 30 నుంచి 35 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కార్మికుల అటెండెన్స్ తీసుకోవడం, ఇంటింటి తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించేలా, రోడ్లు శుభ్రం, డ్రెయినేజీల్లో పూడికతీత, స్వచ్ఛ ఆటోల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం అమలు తదితర పనులు పర్యవేక్షించాలి. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలి.
66 డివిజన్లలో 192 మంది కార్మికులు
నగరవ్యాప్తంగా 66 డివిజన్లున్నాయి. బల్దియా పర్మనెంట్ జవాన్లు 32 మంది, ఔట్‌సోర్సింగ్ జవాన్లు 160 మంది పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ డివిజన్‌కు ఇద్దరు చొప్పన జవాన్లు ఉంటే సరిపోతుంది. ఇదే విషయం ఈనెల 1న ఖిలా వరంగల్‌లో పారిశుద్ధ్య పనుల తనిఖీ సందర్భంగా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజారోగ్యం అధికారులను హెచ్చరించారు. కానీ ప్రస్తుతం డివిజన్‌కు ముగ్గురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు.
అనధికారికంగా మరో 40 మంది
డివిజన్లలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో మరో 40 మంది అనధికారికంగా జవాన్లుగా చెలమాణీ అవుతున్నారు. వీరు ఎక్కడ పనులు పరిశీలిస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులుగా పనిచేసేందుకు కొంత మంది వైట్ కాలర్స్ ఇష్టపడట్లేదు. దీంతో వీరిని అనధికారికంగా జవాన్లుగా కొనసాగిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల్లో సీనియార్టీ ప్రకారం కాకుండా, ఎలాంటి విద్యార్హతలు లేని వాళ్లను జవాన్లుగా నియమిస్తుండడంతో క్షేత్రస్థాయిలో పనిచేసే వారి సంఖ్య తగ్గి, పర్యవేక్షించే వారు ఎక్కువవుతున్నారనే ఆరోపణలున్నాయి.
అనధికారికంగా మరో
40 మంది శానిటరీ జవాన్లు
క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణపై కమిషనర్ అసహనం
ఇద్దరు చొప్పున పని చేయాలని
ఆదేశాలు