
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్ : క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో టీబీ విముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మనస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ వారి సహకారంతో 20 న్యూట్రీషన్ కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా టీబీ పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. క్షయవ్యాధితో బాధపడేవారు సమయానుకూలంగా మందులు వేసుకోవాలని, చక్కటి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధినుంచి త్వరగా కోలుకుంటారన్నారు. స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. జిల్లా వైధ్యాధికారి అప్పయ్య మాట్లాడుతూ.. క్షయవ్యాధి లేని సమాజాన్ని నిర్మించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి హిమబిందు, మాస్ మీడియా అధికారి అశోక్ ప్రసన్నకుమార్, మనస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ సంస్థ మహేశ్, జిల్లా టీబీ కో ఆర్డినేటర్లు సుష్మ, నగేష్, సూపర్‌వైజర్ విజయ్, హెల్త్ విజిటర్ అంజమ్మ, సునీత తదితరులున్నారు.