పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

● గోడవలు స్పష్టించే వ్యక్తులను బైండోవర్‌ చేయాలి ● శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌ ● ప్రతి పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో ఎలక్షన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు ● జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు

నగరంపాలెం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రతి పోలీస్‌ అధికారి ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో సెప్టెంబర్‌ నెలపై నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో నమోదైన నేరాలు, కేసుల పురోగతి, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిర్వహణ, మహిళల భద్రత, చిన్నారుల భద్రత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పెండింగ్‌ కేసుల పరిష్కారంపై సమీక్ష చేపట్టారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత ఎన్నికల ఆధారంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశాలు, పోలింగ్‌ వేళ వచ్చే సమస్యలపై ముందస్తు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పటిష్టం చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయంగా ఉండాలన్నారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్‌కు అంతరాయం స్పష్టించే వ్యక్తులపై బైండోవర్‌ చేయాలని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలన్నారు. లైసెన్స్‌ ఆయుధాలు డిపాజిట్‌ చేయించాలని పేర్కొన్నారు. బ్యాంక్‌ విధుల్లో వారికి నిబంధనల మేరకు మినహాయింపులుసివ్వాలని సూచించారు. ప్రతి పోలీస్‌ సబ్‌ డివిజన్‌లో ఎలక్షన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పకడ్బందీగా రాత్రి గస్తీ

ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో అలకించాలని అన్నారు. ప్రతి కేసుకి సంబంధించి డిజిటల్‌ సాక్ష్యాలను ఈ–సాక్ష్య యాప్‌లో విధిగా నమోదు చేయాలన్నారు. రోజు వారీ విజిబుల్‌ పోలీసింగ్‌, వాహన తనిఖీలు, గ్రామ సందర్శనలు, నేర నివారణ చర్యలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. రాత్రివేళల్లో గస్తీ సిబ్బంది లాఠీలు, టార్చ్‌లైట్లు, విజిల్స్‌తో విధుల్లో ఉండాలని అన్నారు. రక్షక్‌ వాహనాలు నిరంతరం గస్తీ చేపట్టాలని చెప్పారు. హైవే పెట్రోలింగ్‌ వాహనాలు ప్రమాద ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తీవ్రమైన నేరాల్లోని నేరస్థులపై అవసరమైన చోట రౌడీషీట్లు, సస్పెక్ట్‌ షీట్లు తెరవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గంజాయి కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. మూడు కంటే ఎక్కువ ఎన్‌డీపీఎస్‌ కేసుల్లోని నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రయాణాల్లో హెల్మెట్‌ ధరించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, డీఎస్పీలు అలహరి శ్రీనివాస్‌ (ఎస్‌బీ), టి.సీతారాం (గుంటూరు తూర్పు), బెల్లం శ్రీనివాసరావు (గుంటూరు పశ్చిమ), శ్రీనివాస్‌రెడ్డి (మహిళా పీఎస్‌) మురళీకృష్ణ (గుంటూరు ఉత్తర), మురళీకృష్ణ (తుళ్ళూరు), జనార్దనరావు (తెనాలి), కాంతారావు (ట్రాఫిక్‌), శివాజీ (సీసీఎస్‌), సంకురయ్య (ఏఆర్‌), సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement