కొరిటెపాడు(గుంటూరు): పత్తి సాగులో రైతులు పాటించే యాజమాన్య పద్ధతులతో పాటు పత్తి తీత సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పత్తి ప్రిన్సిపల్ శాస్త్రవేత్త ఎం.చాముండేశ్వరి సూచించారు. గుంటూరు మిర్చి యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ప్రపంచ పత్తి దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పత్తి నాణ్యతను కాపాడితేనే మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్నారు. లాం ఫాంలో గత ఎనిమిది ఏళ్లుగా పరిశోధనలు చేసి అధిక దిగుబడితో పాటు, గులాబీ రంగు పురుగును తట్టుకునే పత్తి వంగడాలని రూపొందించినట్లు వెల్లడించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చే రైతులు ముందుగానే పత్తిని శుభ్రపరిచి, తేమ లేకుండా చూసుకోవాలని సూచించారు. పత్తిలో ఇతర పదార్థాలు కలిస్తే నాణ్యతపై ప్రభావం పడుతుందని, అందువలన పత్తిని నేలపై నేరుగా పోయకుండా టార్పాలిన్ లేదా శుభ్రమైన వస్త్రాలపై ఆరబెట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పత్తి తూకం, నాణ్యత పరీక్ష, ధర తదితర వివరాలను రైతులు తెలుసుకోవాలని వెల్లడించారు. సీసీఐ డెప్యూటీ జనరల్ మేనేజర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ పత్తి కొనుగోలులో నాణ్యత ప్రమాణాలను పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మిర్చి యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారని, రాబోవు సీజన్‌లో మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.
పలువురు పత్తి రైతులు మాట్లాడుతూ కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ మిల్లులో అయినా విక్రయించుకునే వెసలుబాటు కల్పించాలని సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పత్తి బోరేలతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ పరీక్ష, నాణ్యత పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. పత్తి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచాలని, తూకం యంత్రాలు, నాణ్యత పరీక్ష పరికరాలు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారీగా వచ్చే పత్తి పరిమాణానికి అనుగుణంగా కొనుగోళ్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పంటను పండించడమే కాదు.. నాణ్యతను కాపాడి సకాలంలో విక్రయించుకునే అవకాశం కల్పిస్తేనే రైతుకు పత్తి సాటు ప్రయోజనం దుక్కుతుందని వారు పేర్కొన్నారు. మిర్చి యార్డు చైర్మన్ కుర్రా అప్పారావు, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ దివాకర్, ఏడీఎం పి.సత్యనారాయణ చౌదరి, టీఎంసీ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నాయకుడు సాంబశివరావు, యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక పాల్గొన్నారు.


