అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ముఖ్యం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: అటవీ ప్రాంతాలు, వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని వయోజన విద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె. ఆంజనేయులు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఉన్న వయోజన విద్యాశాఖ కార్యాలయంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవం–2026లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ విద్యా పరిషత్‌, గుంటూరు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి సహజ ఆవాసాలను పరిరక్షించాలన్నారు. వన్యప్రాణులకు సురక్షిత సంచార మార్గాలు కల్పించాలని అన్నారు. అడవుల పరిరక్షణ ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ విద్య సమన్వయకర్త డి. తిరుపతి రెడ్డి, సూపర్‌వైజర్‌లు వెంకట స్వామి , ప్రసాద్‌ , ఏపీ పర్యావరణ విద్యా పరిషత్‌ సభ్యులు జె.స్వామినాథన్‌, పి. చంద్రశేఖర్‌, పి.దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ వర్సిటీ దూరవిద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం, ఏపీ ఆధ్వర్యంలో దూరవిద్య విధానం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 13వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు వర్సిటీ ప్రాంతీయ సమన్వయకర్త, జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్‌ పి.గోపీచంద్‌ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణులైన వారు, బీఎస్సీలో చేరేందుకు ఇంటర్‌లో సైన్స్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. బీఎల్‌ఐఎస్సీ కోర్సులో ప్రవేశం పొందుటకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 45 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. వివరాలకు 73829 29605 నంబర్లో సంప్రదించాలని సూచించారు. అదే విధంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఏఓయూఏపీ.ఏసీ.ఇన్‌ సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసిన అనంతరం ఆన్‌లైన్‌లోనే నిర్ణీత అడ్మిషన్‌ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

జిల్లా పోలీస్‌ లోగో ఆవిష్కరణ

నగరంపాలెం: గుంటూరు జిల్లా పోలీస్‌ లోగోను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ డీఎస్పీలతో కలిసి బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇక నుంచి జిల్లా పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఈ లోగోను ధరించాలని సూచించారు. ఈ లోగో జిల్లా పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందని అన్నారు. తద్వారా ప్రజల్లో జిల్లా పోలీస్‌ వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. జిల్లాకు ప్రత్యేకమైన పోలీస్‌ లోగోను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఎస్పీ చెప్పారు.

వైద్యశాఖ కాంట్రాక్ట్‌

ఉద్యోగుల సమ్మె

గుంటూరు మెడికల్‌: కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బంది బుధవారం పూర్తి స్థాయిలో సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సిబ్బంది గుంటూరు జీజీహెచ్‌కు వచ్చి తమ నిరసన తెలియజేశారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించారు. ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు మనీషా, రమాదేవి, రేణుక, చిన్న బ్రహ్మం, శైలజ, చారి, హైమావతి, బాలసుందరి, తదితరులు పాల్గొన్నారు. రోగులకు వైద్య సేవల్లో కొంత ఇబ్బంది ఏర్పడింది. బహుజన సమాజ్‌ పార్టీ నేత గంగోలు శ్యామ్యూల్‌ కాంట్రాక్టు వైద్య సిబ్బందికి తమ మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement