డ్రగ్స్‌ నివారణపై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ నివారణపై అవగాహన కల్పించండి

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

తాడేపల్లి రూరల్‌: రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. ఉండవల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మాదకద్రవ్యాల నివారణపై మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా డ్రగ్స్‌ నివారణ, యువతలో అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన ఈగల్‌ క్లబ్‌లను మరింత క్రియాశీలం చేయాలని లోకేశ్‌ సూచించారు. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’, ‘ఆపరేషన్‌ చైతన్యం’, ‘సేఫ్‌ క్యాంపస్‌ జోన్‌’ వంటి కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నెలకోసారి విద్యార్థులతో టౌన్‌హాల్‌ సమావేశాలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సింథటిక్‌ డ్రగ్స్‌ నివారణకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల సమన్వయంతో త్వరలో విశాఖపట్నంలో కాంక్లేవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల్లో నిఘా పెంచడంతోపాటు డ్రోన్‌ నిఘాను విస్తరించాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఈగల్‌ ఐజీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ గంజాయి రవాణా, వినియోగంపై నిఘా కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో 36 శిక్షణ పొందిన జాగిలాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా షెడ్యూల్‌ డ్రగ్స్‌, కాఫ్‌ సిరప్‌లు విక్రయించిన 20 మెడికల్‌ షాపులను సీజ్‌ చేసినట్లు చెప్పారు. 192 మంది యాక్టివ్‌ రిపీట్‌ అఫెండర్లను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement