ఇంధన సెగలు! | - | Sakshi
Sakshi News home page

ఇంధన సెగలు!

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

ఆయిల్‌ కంపెనీల నుంచి అరకొర సరఫరా మూడు రోజుల నుంచి పెట్రోల్‌ కొరత ఉన్నా పట్టించుకోని అధికారులు సీఎం సమీక్షలోనే అంగీకరించిన వైనం హైవేలలో మూతపడ్డ పెట్రోల్‌ బంక్‌లు వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగానికి డీజిల్‌ కొరత జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ అర్ధరాత్రి బంకుల తనిఖీలు

గుంటూరు వెస్ట్‌: ఇంధనం మంట పుట్టిస్తోంది. ఇన్నాళ్లు గ్యాస్‌ దడ పుట్టించగా.. ఇప్పుడు డీజిల్‌, పెట్రోల్‌ గుబులు రేకెస్తోంది. తగినంతగా డీజిల్‌, పెట్రోల్‌ సరఫరా లేకపోవడం.. అవసరానికి దొరకదేమోనని ఆందోళనతో వాహన చోదకులు పెట్రోల్‌ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఆయిల్‌ ఏ బంకులో ఉంటే అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల సమీక్షలో ఇంధన కొరతపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు అధికారులను మందదలించారు.

ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి ఇలా..

గుంటూరు పట్టణంలోనే డీజిల్‌తో నడిపే ఆటోలు సుమారు 20 వేల వరకు ఉన్నాయి. దీంతోపాటు బస్సులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటికి డీజిల్‌తోపాటు పెట్రోల్‌ ఎంతో కీలకం. గల్ఫ్‌ వార్‌ ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్‌, ఆయిల్‌ ధరలతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాల్సింది పోయి కొంత నిర్లిప్త భావన కూడా కొరతకు ఒక కారణమనే చెప్పాలి.

బంకులకు తగ్గిన ఇంధన సరఫరా

హెచ్‌పీసీఎల్‌, ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌ బంకులకు క్రెడిట్‌ సౌలభ్యం ఒక్కసారిగా నిలిపివేయడంతో బంకులకు ఇంధన సరఫరా మందగించింది. వినియోగదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వాహన చోదకులు ముందస్తు జాగ్రత్తగా అధిక మొత్తంలో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం 34 శాతం, ఆదివారం 22 శాతం పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ డిమాండ్‌ పెరిగింది. హైవేకు ఇరువైపులా ఉన్న పెట్రోల్‌ బంకులు మూతపడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భారీ వాహనాలు జాతీయ రహదారులకు ఇరువైపులా నిలిచిపోతున్నాయి.

అధికారుల తనిఖీలు..

ఇంధన సెగలు నేపథ్యంలో ఆదివారం జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇంధన సమస్య లేదని చెప్పే ప్రయత్నం చేశారు. రాత్రి జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ బంకుల తనిఖీ చేశారు. ఇక పౌరసరఫరాల శాఖ అధికారులు మూడు రోజుల నుంచి పరిస్థితి సమీక్షించాల్సిన అధికారులు, సిబ్బంది పట్టనట్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement