నగరంపాలెం: గుంటూరు నగరంలోని బృందావన్‌గార్డెన్స్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తున్న మహామంజీరనాదం–26 వైభవంగా కొనసాగుతున్నాయి. సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ 16వ అంతర్జాతీయ నృత్య వేడుకలు ఆదివారం జరగ్గా, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ హనీ ఉన్నికృష్ణన్ (కర్ణాటక) మోహినీ అట్టం, తరిత్ సర్కార్ (జార్ఖండ్) కఽథక్ నృత్యం, క్షితిజా కాసరవల్లి (కర్ణాటక) భరత నాట్యం, గోపాల్ సింగ్ (మణిపుర్) మణిపురి నృత్యాలను విభిన్న విన్యాసాలతో నర్తించారు. కళాకారుల నృత్యాలు సభికులను అలరించాయి. కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కాజు వేంకటసుబ్రహ్మణ్యం, కోశాధికారి వేంకటగిరి నాగలక్ష్మీ, నారా రాధిక పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏడు రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న టీ–20 సీనియర్ క్రికెట్ ఆంధ్ర జోనల్ టోర్నీలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచిందని జీడీసీఏ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.వి.శివరామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్టు నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, విశాఖపట్నం, అనంతపురం జట్లపై వరుస విజయాలతో విజయ పరంపర కొనసాగించిందన్నారు. ఆంధ్ర జోనల్ విన్నర్‌గా నిలిచిందన్నారు. ముఖ్యంగా యువ క్రీడాకారులు సమష్టిగా రాణించి అద్భుత విజయాలు నమోదు చేశారని తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత గుంటూరు జిల్లా క్రీడాకారులు విజేతగా నిలవడం అభినందనీయమన్నారు. జట్టు సభ్యులకు త్రీ మెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్‌బాబు, సిహెచ్.వి.నాగరాజు అభినందనలు తెలిపారు.
చీరాల రూరల్: థాయ్‌లాండ్‌లో నిర్వహించిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాలకు చెందిన క్రీడాకారులు సిహెచ్.నాగరాజు, జి.ఉమామహేశ్వరరావు, ఎ.సాంబశివరావు 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్ విభాగంలో పాల్గొని పతకాలు సాధించారు. ఆదివారం స్థానిక ఎన్‌ఆర్ అండ్ పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడారు. 100, 200 మీటర్లు పరుగు పందెంలో, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ మెడల్స్ సాధించి చీరాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని క్రీడాకారులను కొనియాడారు. పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, నారాయణమూర్తి, శ్రీరాం రమేష్, పూర్ణా, మద్దు వెంకట సుబ్బారావు, రవి, భాస్కరరావు, రామబ్రహ్మం పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.80 అడుగులకు చేరింది. ఇది 160.0644 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


