స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొనాలి

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొనాలి

జల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ గుంటూరులో సెన్సస్‌ 5కే రన్‌

నెహ్రూనగర్‌: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనగణన (’సెన్సెస్‌–2027) మొదటిసారిగా డిజిటల్‌ విధానంలో జరుగుతోందని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఆదివారం ‘సెన్సస్‌ 5 కే రన్‌‘ను జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు నిర్వహించారు. తొలుత నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌తో కలసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ (httpr://re.cenrur.gov.in) ద్వారా ఏప్రిల్‌ 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దేశాభివృద్ధిలో కీలకమైన ఈ జాతీయ కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని, డిజిటల్‌ పద్ధతిలో తమ వివరాలను నమోదు చేసుకుని జనగణనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగణనపై ఎటువంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. జనగణనలో ఓటీపీ కేవలం లాగిన్‌ కోసం మాత్రమే అడగడం జరుగుతుందని బ్యాంకు గాని ఇతర సంబంధిత వివరాలు ఇందులో అడగడం జరగదని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ ప్రజలు స్వీయ గణనలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ధ్రువీకరిస్తారని స్పష్టం చేశారు. డిజిటల్‌ విధానంలో స్వీయ గణన చేసుకోవడం వలన మే ఒకటో తేదీ నుంచి ఇంటింటికి జరిగే జనాభా లెక్కల సేకరణ సులభతరం అవుతుందని అన్నారు. ఈ ‘సెన్సస్‌ 5కే రన్‌‘లో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జిల్లా పరిషత్‌ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీహెచ్‌.కృష్ణ, పర్యాటక అధికారి రమ్య, జనాభా గణన ఇన్‌చార్జి అధికారి ఆదిత్య లక్ష్మి, కలెక్టర్‌ కార్యాలయ విభాగం పర్యవేక్షకులు మల్లీశ్వరి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎడ్ల భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement