వాహనదారులపై సెస్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

వాహనదారులపై సెస్‌ పిడుగు

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

వాహనదారులపై సెస్‌ పిడుగు

లైఫ్‌ ట్యాక్స్‌పై అదనం మరో పదిశాతం వడ్డింపు రాష్ట్ర ప్రభుత్వ సుంకాలతో బెంబేలెత్తున్న వాహనదారులు

పట్నంబజారు: ప్రభుత్వం దోచుకుంటోంది. ఏడాపెడా పన్నులు వేస్తోంది. ఏ వర్గాన్ని వదలడం లేదు. తాజాగా వాహనదారులపై అదనంగా ట్యాక్స్‌ వేసింది. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు, బీమా ప్రీమియం, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, రోడ్‌ ట్యాక్స్‌లు, ఫిటినెస్‌ చార్జీలతో వాహనదారులు సతమతమవుతున్నారు., రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సామాన్యుడిపై మరింత భారాన్ని మోపుతోంది. వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌కు అదనంగా 10 శాతం సెస్‌ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఈ నిర్ణయం తీసుకోగా, ఈ జనవరి 14వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం దీనిని ‘రోడ్‌ సేఫ్టీ సెస్‌’గా చెబుతున్నప్పటీకీ... వాహనదారుల దృష్టిలో ఇది మరో రూపంలో పన్నుల పెంపుగానే కనిపిస్తోంది.

వడ్డింపు ఎలా అంటే..

ఈ నిర్ణయం ప్రభావం నేరుగా అర్థమయ్యేలా లెక్కలు చూస్తే రూ.లక్ష విలువైన వాహనాన్ని తీసుకుంటే, సాధారణంగా లైఫ్‌ ట్యాక్స్‌ సగటున 12 శాతం ఉంటే దానికి రూ.12,000 చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు అదే లైఫ్‌ ట్యాక్స్‌పై 10 శాతం సెస్‌ విధించడంతో అదనంగా రూ.1,200 చెల్లించాల్సి వస్తోంది. ఒక లక్ష వాహనానికే వాహనదారుడి జేబు నుంచి అదనంగా వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది కేవలం సెస్‌ మాత్రమే. దీనికి తోడు రిజిస్ట్రేషన్‌ ఫీజు, బీమా, నంబర్‌ ప్లేట్‌ ఖర్చులు కలిపితే మొత్తం వ్యయం మరింత పెరుగుతోంది. ఇదే లెక్కను మధ్యతరగతి ఎక్కువగా కొనుగోలు చేసే ఐదు లక్షల రూపాయల వాహనానికి వర్తింపజేస్తే, లైఫ్‌ టాక్స్‌ సుమారు రూ.60 వేలు ఉంటే, దానిని 10 శాతం సెస్‌ కలుపుకుని రూ.6 వేలు అదనంగా సుంకం చెల్లించాల్సి ఉంది. రూ.10 లక్షల వాహనానికి అయితే లైఫ్‌ ట్యాక్స్‌, సెస్‌ కలిపి రూ.లక్ష 32 వేలు వరకు చెల్లించాల్సి ఉంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాపై ప్రభావం

రవాణా శాఖ గణాంకాల ప్రకారం గుంటూరు ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 28 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు భారీ సంఖ్యలో ఉండగా, కార్లు, జీపులు, ఆటోలు, లారీలు, బస్సులు, స్కూల్‌ వాహనాలు కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి నెలా గుంటూరు జిల్లాలో వేల సంఖ్యలో కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతున్నాయి. ఈ కొత్త వాహనాలన్నింటిపై ఇకపై 10 శాతం సెస్‌ తప్పనిసరిగా వర్తించనుంది. జనవరి 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు 15 వేలకుపైగా వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. వాటిలో ద్విచక్ర వాహనాలు, కార్లు అధికంగా ఉన్నాయి. సుమారుగా రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు వచ్చింది.

సుంకం లెక్కలేదు..

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెస్‌ రూపంలో వచ్చిన సుంకాన్ని రహదారి భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెబుతూ.. వాహనదారులపై పెనుభారాన్ని మోపుతోంది. సేకరించిన సెస్‌ మొత్తాన్ని రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, భద్రతా ఏర్పాట్లకు వినియోగిస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు వసూలు చేసిన పన్నుల పరిస్ధితి ఏంటనీ వాహనదారుల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement