నెహ్రూనగర్: విద్యాభివృద్ధికి దాతల సాయం మరువలేనిదని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కొనియాడారు. స్తంభాల గరువులోని ఉడుముల కోటి రత్నం, సాంబిరెడ్డి రెడ్ల బాలికల నూతన వసతి గృహ ప్రారం భోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రెడ్ల బాలికల హాస్టల్ నిర్మాణం కోసం బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బండి అశోక్ రెడ్డి, సుధారాణి దంపతులు రూ.కోటి, ఉడుముల కోటి రత్నం రూ.కోటి, మరి కొంతమంది దాతలు రూ.2కోట్లు ఇచ్చి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. దాతలు ఇచ్చిన సహకారంతో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్లో చదువుకునే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత మీ ఉన్నతికి సహకరించిన హాస్టల్ అభివృద్ధికి సహాయ సహకారం అందించాలన్నారు. రెడ్డి హాస్టల్లో మరిన్ని వసతులు కల్పించి మరింత మందికి వసతి కల్పించి విద్యాభివృద్ధికి సహకరించేందుకు రెడ్డి సామాజిక వర్గం తగిన సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్ అభివృద్ధికి అనవేమా ట్రస్ట్ చేస్తున్న కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమవరపు పిచ్చిరెడ్డి, గుంటూరు వేమారెడ్డి, మోదుగుల వాసుదేవ రెడ్డి, దుగ్గెంపూడి వెంకట్రామిరెడ్డి, కంది సంజీవరెడ్డి, చల్లా అంజిరెడ్డి, వనుకూరి సూరారెడ్డి, రోళ్ళ మాధవి, అచ్చాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి బాలికల నూతన వసతి గృహ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి


