గుంటూరు మెడికల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్‌ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోర్సును ప్రవేశపెట్టి, వారి గుర్తింపు కోసం ఎంతో కృషి చేశారని ఏపీఆర్‌జేసీ న్యాయ సలహాదారు డాక్టర్ లోక్‌నాథ్ అన్నారు. ఆదివారం గుంటూరు నాజ్‌సెంటర్‌లో సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ లోక్ నాథ్ మీడియా తో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆర్‌ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ మరుగున పడిపోయిందన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వి రమణ మాట్లాడుతూ గ్రామీణ రోగులను పరీక్షించి ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్‌ఎంపీ వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు చేసే సేవ మరువలేనిదన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు, అధ్యక్షుడు సాంబశివరావు, అమర్ రెడ్డి, నిర్గుణ రావు, శ్రీనివాసరావు, వలి, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వి.బ్రహ్మరెడ్డి, అఖిల భారత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతల ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సెయింట్ జాన్ అంబులెన్స్ ఇండియా గౌరవ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ ఎం.మహేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది వి.బి.సుమంత్ లు మాట్లాడుతూ.. 24 గంటలూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఆర్‌ఎంపీలు వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. గుర్తింపు ఉన్నా లేకపోయినా ధైర్యంగా ప్రజలకు వైద్యం అందించాలని, అది ప్రథమ చికిత్సకు కట్టుబడి మాత్రమే పనిచేయాలని సూచించారు. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా, ఎన్ని పీహెచ్‌సీలు పెరిగినా, అర్థరాత్రి అయినా ఆర్‌ఎంపీలకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. పలు జిల్లాలకు చెందిన గ్రామీణ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


