మద్దతుపై దగా.. రైతులపై పగ | - | Sakshi
Sakshi News home page

మద్దతుపై దగా.. రైతులపై పగ

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

● ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ ● తరలి రానున్న ముఖ్య నాయకులు, సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు ● మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ గిట్టుబాటు ధర రావడం లేదు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు సర్కార్‌ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో... ఖర్చుల్లో పెరుగుదల భారం

కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అంతులేని నిర్లక్ష్యం ఇదే అదనుగా జేబులు నింపుకొంటున్న దళారులు క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్న అన్నదాతలు కనీస చర్యలు కూడా చేపట్టని అధికార యంత్రాంగం

ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట పండించడమే కష్టం.. అమ్ముకోవడం మరింత సమస్య అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చోద్యం చూస్తున్నారు.

ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నా. దిగుబడి ఎకరానికి 41 క్వింటాళ్లు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.1,700కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తే నష్ట రాకుండా ఉంటుంది.

– యర్రాకుల వీరాంజనేయ రాజు,

వీరనాయకునిపాలెం, చేబ్రోలు మండలం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: బర్లీ పొగాకు, పత్తి పంటలు సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయంగా శనగ, మొక్కజొన్న సాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. ఆ మాటలు విని మొక్కజొన్న సాగు చేసిన రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆటుపోట్లను తట్టుకుని పండించినా గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. దళారులు అడిగిన కాడికి విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు కూడా రాక, అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చేతులెత్తేసింది. గుంటూరు జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రూ.1,400 నుంచి రూ.1,700కే అడుగుతున్నారు. దిక్కులేని స్థితిలో నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు తప్పడం లేదు. ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేయూతనిచ్చారు. దళారులు సైతం అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు లాభాలు గడించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల సహాయంతో మద్దతు ధర వచ్చేలా చూశారు. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 79,202.50 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు సుమారు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పులపాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులే అధికంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు రైతన్నా మీ కోసం అంటూ కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నకు ధర లేదని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. రైతులు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ నేటికీ ప్రయోజనం దక్కలేదు. తెలంగాణలో 2025–26 ఖరీఫ్‌ సీజన్‌తో పాటు రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్నలను అక్కడి ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.2,400 ప్రకారం కొనుగోలు చేస్తోంది. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న రైతులు రూ.210 కోట్ల నుంచి రూ.270 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉంది.

తొమ్మిదిన్నర ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఖరీఫ్‌లో వరి ధర పతనంతో తీవ్రంగా నష్టపోయా. ప్రస్తుతం మొక్కజొన్నకు ఎకరానికి 40 వేల వరకు పెట్టుబడి పెట్టా. క్వింటా రూ.1,650 మాత్రమే ఉంది.

– మాతంగి ఆశీర్వాదం, శేకూరుపాలెం, చేబ్రోలు మండలం

మంగళగిరి టౌన్‌ / పొన్నూరు/ గుంటూరు వెస్ట్‌: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ శనివారం గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ఉన్న ధర్నాచౌక్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మొక్క జొన్న రైతు పోరాట దీక్ష ’ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం దీక్షపై వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు ధరలేక ఇబ్బందు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో విస్తృత స్ధాయిలో మొక్కజొన్న పండించారని పేర్కొన్నారు. కేవలం 1600 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మద్దతు ధర రూ. 2400 ఉందని, 800 తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్‌ వద్ద పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష ’ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులు అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వ దృష్టికి రైతుల ఇబ్బందులను తీసుకువెళ్లే ప్రయత్నానికి సహకరించాలని కోరారు.

మద్దతు ధర అందించిన వైఎస్సార్‌సీపీ

పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ... గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రైతులకు మద్దతు ధర కింద రూ. 2,400 ప్రకటించి నాలుగు సంవత్సరాలపాటు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400లకు కొనుగోలు చేయాలని కోరుతూ ఈ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని అన్నారు. ఎమ్మెల్యే తమ సంగం సంస్థ పేరిట నిల్వ చేసి పశువులకు దాణాగా మార్చటంతో మరికొంత మారుబేరానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. గుంటూరులో నిర్వహిస్తున్న దీక్షకు జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్‌, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు పాల్గొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు, మురళీకృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement