రోడ్డెక్కితే మంట.. ఎటెళ్లినా తంటా! | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కితే మంట.. ఎటెళ్లినా తంటా!

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

● గుంటూరులో ట్రాఫిక్‌ సమస్యలతో గంటలకొద్దీ తప్పని ప్రయాణం ● ఎండాకాలం కావడంతో నరకయాతన పడుతున్న వాహనదారులు ● రోడ్డుకు అడ్డంగా ఆటోలను పెట్టి... కనీసం నడిచే దారి కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఘర్షణకు దిగుతున్నారు. నాజ్‌సెంటర్‌లోని డీమార్ట్‌ వద్ద ఇదే పరిస్థితి. అక్కడ ఆటో స్టాండ్‌ సభ్యులు రోడ్డుపైనే వాహనాలను ఆపుతుతున్నారు. ● ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద చెప్పాల్సిన పని లేదు. బస్సులు నిలిపే స్థలాల్లో కూడా ఆటోవాలాలు అడ్డగోలుగా వారి వాహనాలు నిలుపుతున్నారు. బ్రహ్మానందరెడ్డి స్టేడియం మొదలు ఓల్డ్‌క్లబ్‌ రోడ్డు దాటే వరకు వాహనదారులకు నిత్యం నరకమే. ముఖ్యమైన కూడళ్లలో అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ చోద్యం చూస్తున్నారు. రవాణాశాఖ అంచనాల ప్రకారం గుంటూరు నగరంలో ఈ ఒక్క మార్గంలోనే పీక్‌ అవర్స్‌ సమయంలో గంటకు సుమారు 8 వేల నుంచి 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజువారీగా వీటి సంఖ్య సుమారు 70 వేలు దాటుతోంది. సుమారు 65 శాతం ద్విచక్ర వాహనాలు, 20 శాతం కార్లు, మిగిలినవి ఆటోలు, సిటీ బస్సులు, సరకు వాహనాలు ఉన్నాయి.

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): శంకర్‌విలాస్‌ ఓవర్‌బ్రిడ్జి పనుల్లో భాగంగా అనేక ట్రాఫిక్‌ డైవర్షన్లను నగరంలో చేపట్టారు. దీనికితోడు కొంతమంది ప్రజాప్రతినిధుల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా నగరవాసులకు చేటు చేస్తున్నాయి. ముఖ్యంగా అరండల్‌పేట నాలుగో లైనులో ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్‌ సమస్య అంతా ఇంతా కాదు. డొంకరోడ్డు మొదలు మూడు వంతెనల కిందుగా వాహనదారులు ప్రయాణం చేయాలంటే ప్రత్యక్ష నరకమే కనపడుతోంది. అక్కడి నుంచి కొత్తపేట ఇండియన్‌ స్ప్రింగ్స్‌ పాఠశాల వరకు అసలు మరో మలుపు కూడా లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ సుధీర్ఘ రహదారిలో శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌ అంటే నాలుగు రోడ్ల కూడలి. నాజ్‌సెంటర్‌, లీలామహల్‌రోడ్డు, నెహ్రూనగర్‌, రైల్వేస్టేషన్‌లతో పాటు ఇతర ప్రాంతాల అనుసంధానమై ఉంది. ఇక్కడ సైతం అధికారులు అనాలోచితంగా మూసివేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డొంకరోడ్డు మొదలు కొత్తపేట వరకు వెళ్లాలంటే కనీసం 30 నిమిషాలకుపైగానే పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన విద్యాసంస్థలు, వాణిజ్య కేంద్రాలు, ఆసుపత్రులు ఈ మార్గంలోనే ఉండటంతో ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాల రద్దీ తీవ్రస్థాయికి చేరుతోంది. కొత్తపేట శివాలయం నుంచి లీలామహల్‌ సెంటర్‌ వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులు అధికంగా ఉన్న ప్రాంతం కావటంతో ఒక్కోసారి అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రజాప్రతినిధి చెప్పారని...

ఒక ప్రజాప్రతినిధి చెప్పాడనే కారణంతో గుంటూరు తూర్పు పరిధిలో అత్యంత కీలకమైన రాధాకృష్ణ థియేటర్‌ సెంటర్‌ (ఆర్కేటీ) పాయింట్‌ను మూసివేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని పూర్తిగా నిలువరించటం వలన ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి వచ్చే వారికి, లాలాపేట మార్కెట్‌ ప్రాంతాలకు వెళ్లే వారికి, కొత్తపేట వచ్చే వారికి అనేక ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా కింగ్స్‌ హోటల్‌ సెంటర్‌ వద్ద ట్రాఫిక్‌ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితి లేదు. మాయాబజార్‌ వంటి సందుల్లో ప్రయాణం చేసి కొత్తపేట, నాజ్‌సెంటర్‌ వైపు వెళ్లాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రైల్వేస్టేషన్‌ వద్ద పరిస్థితి దారుణంగా మారింది.

గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థ ఇప్పటికే అస్తవ్యస్తంగా మారింది. శంకర్‌విలాస్‌ ఓవర్‌ బ్రిడ్జి పనుల నేపథ్యంలో సమస్య ఇంకా ఎక్కువైంది. నిప్పులు కక్కుతున్న భానుడి ఉగ్ర ప్రతాపంతో వాహనదారులు రోడ్డుపైకి వస్తే చాలు బెంబేలెత్తుతున్నారు. పాలకులు, అధికారుల అనాలోచిత విధానాలతో సామాన్యులు అల్లాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement