దివ్యాంగులను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వం

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

దివ్యాంగులను వేధిస్తోన్న కూటమి ప్రభుత్వం

మంగళగిరి టౌన్‌: రీ వెరిఫికేషన్‌ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దివ్యాంగులను వేధిస్తోందని రాష్ట్ర దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్‌ వెంబడి ఉన్న వైఎస్సార్‌ సీపీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షులు బొక్క అగస్టీన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి దివ్యాంగుల విభాగం సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్‌, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దుర్గారెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడా దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వకుండా రీ వెరిఫికేషన్‌ పేరుతో ఇబ్బందులు పెడుతోందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క కుప్పం నియోజకవర్గంలో 350కి పైగా కొత్త పెన్షన్లు ఇచ్చారని, చంద్రబాబు ఒక్క కుప్పంకు ముఖ్యమంత్రా? రాష్ట్రానికా అని ప్రశ్నించారు. గతంలో 90 శాతం ఉన్న దివ్యాంగులను నేడు 45 శాతం ఉందంటూ పెన్షన్లు ఎత్తివేసే భారీ కుట్ర ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. దివ్యాంగులకు రావాల్సిన సదరం సర్టిఫికెట్‌, బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు వెరిఫికేషన్‌ పేరుతో ఎక్కడ అన్యాయం జరిగినా ఉద్యమబాట చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యలపై అధినాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారని తెలియజేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికై వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో గుంటూరు తూర్పు, తెనాలి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరి ఫాతిమా, అన్నాబత్తుని శివకుమార్‌, అంబటి మురళీకృష్ణ, వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆవుల నాగేంద్ర, ఉమ్మడి చిత్తూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు కొణతల చంద్రశేఖర్‌, కృష్ణాజిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు శామ్యూల్‌, మంగళగిరి నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు వేమూరి వందనం ఇస్సాక్‌, గుంటూరు తూర్పు, పత్తిపాడు, తెనాలి నియోజవర్గాల అధ్యక్షులు గణేష్‌, నాగుల్‌ మీరా, సందీప్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దివ్యాంగుల విభాగం

రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి

జిల్లా దివ్యాంగుల విస్తృత

స్థాయి సమావేశం

పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ జిల్లా

అధ్యక్షులు, సమన్వయకర్తలు

Advertisement
 
Advertisement
Advertisement