మంగళగిరి టౌన్: దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలని ఇందుకోసం పట్టుదలతో కూడిన సాధన ఎంతో అవసరమని అంతర్జాతీయ మహిళా రెజ్లర్, రియో ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో గురువారం ఉద్గమ్ 2026 పేరిట జాతీయ స్థాయి క్రీడోత్సవాలను సాక్షి మాలిక్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. తాను 12వ ఏట నుంచి రెజ్లింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టానని, ఎప్పటికై నా ఒలంపిక్స్‌లో పతకం సాధించాలని కోరిక ఉండేదని వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆ కోరిక నెరవేరిందని, భారత జాతీయ పతాకం అంతర్జాతీయ క్రీడావేదికపై ఎగురుతుంటే కలిగే ఆనందం వర్ణించలేనిదన్నారు. ఎంచుకున్న క్రీడారంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కఠోర శ్రమ, సాధనతో దానిని అధిగమించాలని క్రీడాకారులకు సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో రాణించాలన్నారు. వర్శిటీ క్రీడాకారులు ఆదిత్య, అనామిక, ముబాసినాలకు వర్శిటీ తరఫున రూ. 20 లక్షల ప్రోత్సాహక పారితోషికాన్ని అందజేశారు. వీరు ఇటీవల జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సాక్షి మాలిక్, గౌరవ అతిథిగా హాజరైన అర్జున్ అవార్డు గ్రహీత సత్యవ్రత్‌లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్, అసోసియేట్ డైరెక్టర్ సుస్మితా సింగ్, వర్శిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్


