ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం | - | Sakshi
Sakshi News home page

ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

ఫిరంగిపురం: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ అన్నారు. మండలంలోని హౌస్‌ గణేష్‌పాడులో జలధార–జలహారతి, స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. జలధార, జలహారతిలో భాగంగా గ్రామంలోని చెరువు వద్ద పనులకు కొబ్బరికాయ కొట్టి కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం వందరోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి చెరువు నీటితో నిండి ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జలవనరులు మనిషి మనుగడకు దోహదం చేస్తాయని చెప్పారు. వాటిని భావితరాలకు అందించాల్సిన వనరు అని తెలిపారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం వాటర్‌, పాజిటివ్‌ ఆంధ్రా థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌ వెంకటరత్నం, నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ వి.శంకర్‌, జిల్లా పంచాయతీ అధికారి బీవీ నాగసాయి కుమార్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్‌ కె.కల్యాణ చక్రవర్తి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

‘బడి పిలుస్తోంది..’ పెద్దఎత్తున నిర్వహించండి

గుంటూరు వెస్ట్‌: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి.ఎం.సాయికాంత్‌ వర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శత శాతం పిల్లలు ప్రభుత్వ బడిలో నమోదు అయ్యే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, ఇతర అధికారులతో శనివారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రామాణిక విద్య అందించాలనే లక్ష్యంతో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అవగాహన ర్యాలీలను నిర్వహించాలని సూచించారు. ప్రతి చిన్నారి బడిలో ఉండాలని, విద్యకు దగ్గర కావాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, మంచి అర్హత, నైపుణ్యం గల ఉపాధ్యాయులు బోధిస్తారని, ఉచిత పుస్తకాలు పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్‌, బూట్లు వంటి సామాగ్రి అందించడం జరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీల నుంచి పాఠశాలకు చేరే విద్యార్థులు విధిగా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మ్యాపింగ్‌ జరగాలని సూచించారు. ఈ నెల, 20 21 తేదీల్లో విద్యార్థుల సర్వే నిర్వహించాలన్నారు. 23వ తేదీ నాటికి పాఠశాలలో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement