ల్యాబ్ కో ఆర్డినేటర్‌కు వేతనాలు చెల్లించని అధికారులు వైద్య సిబ్బందికి శిక్షణలోనూ అందే తంతు మూలకు చేరిన రూ. కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు స్కిల్ సెంటర్ నిర్వహణ తీరు దారుణం
వేతనాలు చెల్లించని విషయం వాస్తవమే..
ఇతర జిల్లాల్లో రెండేళ్లు... ఇక్కడ మూడు నెలలే...
సుమారు రూ. 2 కోట్లకుపైగా ఖరీదు చేసే వైద్య పరికరాలు స్కిల్స్ ల్యాబ్‌లో ఉన్నాయి. వైద్య పరికరాలు అన్ని ల్యాబ్‌లో లేవని, కొన్ని మాయమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టాక్ రిజిస్ట్రరు, నిధుల అకౌంట్ ఆడిట్ గోప్యంగా ఉంచడం ఎవరికి సమాచారం లేకపోవడం సెంటర్‌తో ఎ సంబంధం లేదని వ్యక్తుల పరిధిలో సెంటర్ నిర్వహణ ఉండటం అనుమానాలకు తావిస్తుంది. అవి కొనుగోలు చేసిన విధానంపై కూడా విమర్శలు ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వినియోగించకుండా మూలన పడేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు నెల్స్ స్కిల్స్ ల్యాబ్‌పై విచారణ చేసి కేంద్ర ప్రభుత్వం ఎంతో మంచి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాన్ని కొనసాగించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
గుంటూరు మెడికల్: కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడి, మరణాలు తగ్గింపే లక్ష్యంగా వైద్యులు, వైద్య సిబ్బందికి వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ (నెల్స్) పేరుతో దేశ వ్యాప్తంగా స్కిల్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గుంటూరు వైద్య కళాశాలలో కోవిడ్–19 సమయంలో నెల్స్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రసూతి మరణాలు తగ్గించడం, పిల్లల అత్యవసర చికిత్సలపై శిక్షణ, పాముకాటు, విష ప్రయోగంపై శిక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రక్తస్రావాన్ని నివారించి ప్రాణాలు కాపాడేందుకు ట్రామా మెడికల్‌పై శిక్షణ ఏదైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తినపుడు ముఖ్యంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, ఫిట్స్, నీళ్లలో ముగిపోవడం వంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవిధంగా రక్షించాలనే విషయాలపై నెల్స్ కేంద్రంలో శిక్షణ అందిస్తారు. శిక్షణ కేంద్రం భవన నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.కోటికి పైగా నిధులు ఖర్చు పెట్టింది. వైద్యులు, వైద్య సిబ్బందికి అచ్చం మనిషి మాదిరిగా ఉండే మాలిక్యూల్స్‌పై శిక్షణ అందించేందుకు పలు వైద్య పరికరాలు సైతం రూ. 2 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. అంతేకాకుండా శిక్షణ సమయంలో వినియోగిఒంచేందుకు నిధులు ఇచ్చింది. శిక్షణ కేంద్రంలో ఇప్పటి వరకు ఎంత మందికి శిక్షణ ఇచ్చారు, వైద్య సిబ్బంది తాము శిక్షణ కాలంలో ఎంత మేరకు నైపుణ్యం పెంపొందించుకున్నారనే విషయాలపై ఎవరికి సమాచారం లేకపోవడం విమర్శలకు తావునిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దేనికి ఖర్చు పెట్టారు, ఎంత మేరకు నిధులు మిగిలి ఉన్నాయి...అనే విషయాలపై ఎవరి వద్ద సమాచారం లేకపోవడం ఒకరిపై ఒకరు నెపాలు వేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా నెల్స్ స్కిల్స్ సెంటర్‌లో కోర్స్ కో ఆర్డినేటర్ పోస్టును భర్తీ చేసిన తీరు తీవ్ర విమర్శలకు, పలు అనుమానాలకు తావిస్తోంది.
మూడు నెలల వ్యవధికే కోర్స్ కోఆర్డినేటర్
గుంటూరు వైద్య కళాశాల నెల్స్ స్కిల్ సెంటర్‌లో కోర్సు కో ఆర్డినేటర్ పోస్టును భర్తీ చేసేందుకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంపికై న వారికి కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తామంటూ పేర్కొన్నారు. హెల్త్ గ్రాడ్యుయేట్ లేదా బీఎస్సీ జీఎన్‌ఎం నర్సింగ్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని నోటిఫికేషన్‌లో విద్యార్హతలు వెల్లడించారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ నర్సింగ్ అభ్యర్థిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశారు. మూడు నెలలకు మాత్రమే ఉద్యోగం ఉంటుందని, నిమామకపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కో ఆర్డినేటర్‌గా వై.అనిత 2026 జనవరిలో విధుల్లో చేరారు. విధుల్లో చేరిన మూడు నెలల అనంతరం కాలపరిమితి ముగిసిందని వైద్య కళాశాల అధికారులు సమాచారం అందించారు. మూడు నెలలపాటు పనిచేసినందుకు వేతనాలు చెల్లించకపోవడం, మరో పక్క ఉద్యోగ కొనసాగింపు లేదని ఆదేశాలు ఇవ్వడంతో సదరు అభ్యర్థిని మీడియాకు తన గోడు వెల్లబుచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ముందే నిధులు విడుదల చేసినప్పటికీ అభ్యర్థినికి వేతనాలు చెల్లించకుండా స్కిల్స్ సెంటర్ ఇన్‌చార్జి, వైద్య కళాశాల అధికారులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ అభ్యర్థినికి చుక్కలు చూపిస్తున్నారు.
నెల్స్ స్కిల్ ల్యాబ్‌లో కోర్స్ కో ఆర్డినేటర్‌కు వేతనాలు చెల్లించకపోవడం వాస్తవమే. ఉద్యోగినికి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ఉన్నతాధికారులకు లేఖ రాశాను. స్కిల్స్ ల్యాబ్ బడ్జెట్‌కు సంబంధించి ఉన్న అకౌంట్‌ను నా దృష్టికి తీసుకు రాకుండానే క్లోజ్ చేశారు. అందువల్లే వేతనాల చెల్లింపు జరగలేదు.
– డాక్టర్ ఎన్.సుందరాచారి,
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్
విశాఖపట్నం నెల్స్ కోర్స్ కో ఆర్డినేటర్‌ను 2024లోనే రిక్రూట్‌మెంట్ చేశారు. రెండేళ్లుగా కోర్సు కో ఆర్డినేటర్ విధులు నిర్వహిస్తున్నారు. కానీ గుంటూరు వైద్య కళాశాలలో మూడు నెలలకే నియామక ఉత్తర్వులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతర జిల్లాల్లో రెండేళ్లపాటు అభ్యర్థులు పనిచేసేలా నియామక ఉత్తర్వులు ఉన్నా గుంటూరు వైద్య కళాశాలలో ముందస్తుగా రిక్రూట్‌మెంట్ చేయకుండా బడ్జెట్ దిగమింగేందుకు ఆర్థిక సంవత్సరం ముగిసే మూడు నెలల కాలానికి ముందు నియామకపు ఉత్తర్వులు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కో ఆర్డినేటర్‌తో స్కిల్ ల్యాబ్ నిర్వహణ పనులు చేయించకుండా ఇతర చోట్ల డ్యూటీలు వేసి పనులు చెల్లించడం స్కిల్ ల్యాబ్‌లో జరుగుతున్న అవినీతికి నిదర్శనమ్మ విమర్శలు ఉన్నాయి.


