గుంటూరు రూరల్: ‘ఎవరు ఎలా పోతే మాకేంటి? మేం మాత్రం పగలూ రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయించాలి. జేబులు పూర్తిగా నిండేలా సంపాదించుకోవాలి’ అన్నట్లుంది నగరంలో, నగర శివారుల్లో బార్ నిర్వాహకుల పరిస్థితి. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం విక్రయిస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నగరంలోనే కాకుండా రూరల్ పరిసరాల్లో సైతం నిత్యం మద్యం అందుబాటులోనే ఉంటోంది. తెల్లవారుజామున 5 గంటలకే బార్లు బార్లా తెరిచి మద్యం విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బార్ పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలి. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు బాహాటంగానే కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి 12 గంటల తరువాత బార్లలో లైట్లు ఆపి మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల వెనుక డోర్ నుంచి విక్రయాలు సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో పాత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటల వరకే మద్యం విక్రయాలు చేసేవారు. అనంతరం బార్లు తెరిచి ఉంటే వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించేవారు.
ఇక్కడ ప్రత్యేక రూల్
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాలి. గుంటూరు నగరంలో మరీముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం రోజులో 24 గంటలు మద్యం ఏరులై పారుతూనే ఉంది. అధికారులకు మామూళ్లు ముట్టజెప్పటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక రాత్రి గస్తీ తిరిగే పోలీసులు సైతం అదే మామూళ్ల మత్తుకు అలవాటయ్యారు. అనధికార అనుమతి ఇస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. బార్ యజమానులు దీనికోసం భారీగానే అధికారులకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక బార్‌లో కొనుగోలు చేసిన బీర్ సీసాలో పురుగులు రావటంతో నిర్వాహకులతో కొనుగోలుదారులు వివాదానికి దిగిన సంఘటన తెలిసిందే. విషయం బయటకు రాకుండా పోలీసులు, బార్ యాజమాన్యం సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం.
విచ్చలవిడిగా పర్మిట్ రూములు
ప్రతి వైన్ షాపులో బార్లను మించిన పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇచ్చి మద్యం విక్రయిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలు, బార్లపై చర్యలు తీసుకుని నాణ్యమైన మద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.


