తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కేంద్ర కార్యాలయం మీడియా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రహుల్లాలు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ పనులపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే వారి దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిరంతరం మజ్జిగ, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మేకా అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నరసరావుపేట: స్వీయ జనగణనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తన వివరాలను ఆన్‌లైన్ ద్వారా శుక్రవారం నమోదు చేసుకున్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమం ప్రారంభమైన విషయం విదితమే. ప్రతి ఒక్కరూ వెబ్‌సైట్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30 తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ వారికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
వినుకొండ: వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మాణంపై పట్టణంలోని ఏనుగుపాలెం రైల్వే గేటు వద్ద ఆర్డీవో కె.బాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. వినుకొండ–అద్దంకి రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జికి సుమారు రూ.54 కోట్లు అంచనా వేశారని తెలిపారు. ఇందులో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమాన వాటా భరిస్తాయని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సివిల్ పనుల కోసం టెండర్లు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీటీ మురళి, ఆర్‌ఐ శ్రీహరి, రెవెన్యూ, మున్సిపల్, రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 527 అడుగులకు చేరింది. ఇది 162.3490 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువకు 3,431, ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 5,231 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 5,231 క్యూసెక్కులు చేరుతోంది.
బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో నలుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజాంపట్నం ఎస్‌ఐ కె.కె.తిరుపతిరావును చెరుకుపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న జి.కిరణ్‌బాబును నిజాంపట్నం స్టేషన్‌కు, జిల్లాలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వర్తిస్తున్న బి.బాబురావును మార్టూరు అర్బన్ స్టేషన్, చెరుకుపల్లి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న టి.అనిల్ కుమార్‌ను వీఆర్ బదిలీ చేశారు.


