ఇద్దరు మహిళలు పట్టుబడినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న పోలీసులు
కీలక వ్యక్తి పూర్తి వివరాలు ఎఫ్‌ఐఆర్‌లో లేని వైనం
వ్యక్తమవుతున్న అనుమానాలు
తెనాలిరూరల్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ వ్యవహారంలో అసలు సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ వ్యవహారంలో ముగ్గురిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పాండురంగపేటకు చెందిన 44 ఏళ్ల బోడపాటి అనూరాధ(ఎ–1), ఇందిరా కాలనీకి చెందిన 56 ఏళ్ల మహమ్మద్ షెహనాజ్(ఎ–2), మరో యువకుడు సాయి (ఎ–3)లపై కేసు నమోదు చేశారు. త్రీ టౌన్ ఎస్‌ఐ నక్కా ప్రకాశరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, సీఐ ఎస్.సాంబశివరావు దర్యాప్తు చేస్తున్నారు. చెంచుపేట పాత ఎమ్మెల్యే బజారు వెనుక ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్‌ఐ ప్రకాశరావు, సిబ్బంది గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. సదరు ఇంట్లో అనూరాధ, షహనాజ్ మాత్రమే ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఎ–1, ఎ–2తో పాటు, ఎ–1 కోడలూ రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్ట్రిప్ చాట్ యాప్‌లో ఆన్‌లైన్‌లో ఉంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ... వారి నుంచి హెచ్‌పీ ల్యాప్‌టాప్, వివో ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. మూడో నిందితుడిగా పోలీసులు పేర్కొన్న సాయి పరారీలో ఉన్నాడని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. సాయి ఇంటి పేరు కానీ, అతని ఇంటి అడ్రస్ వంటి వివరాలేవీ ఎఫ్‌ఐఆర్‌లో లేవు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు, స్ట్రిప్‌చాట్ అకౌంట్ లాగిన్‌లు చూసే సాయి ఈ వ్యవహారంలో కీలకం. అతని ఇంటి పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో లేకపోవడం, మొదటి నిందితురాలి కోడలు గురించి ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన పోలీసులు నిందితుల్లో ఆమె పేరు పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ‘అత్త, కోడలు, పిన్ని, కుమారుడు న్యూడ్ కాల్స్ దందా’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


