జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్‌వర్మ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాటర్ పాజిటీవ్ ఆంధ్రా స్కీమ్‌తో అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. వర్షపు నీటి సంగ్రహణ, నిర్మాణాలు, మరమ్మతులు, పునరుద్ధరణ, చెరువులు, కుంటలు శుభ్రపరచడం, పరిరక్షించడంతోపాటు, ఇంకుడు గుంతల నిర్వహణ, విస్తరణ, శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శ్వాస యాప్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు.
స్వీయ గణనలో పాల్గొనండి
కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ గణనలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 30 వరకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు తమ వివరాలు స్వయంగా ఆన్‌లైన్ పోర్టర్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనగణనగా ఈ కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. జనగణన వల్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని చెప్పారు. పిరియాడికల్‌గా జరిగే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. జనగణనలో ఓటీపీ కేవలం లాగిన్ పోర్ట్ మాత్రమే అడుగుతోందని, బ్యాంకు ఇతర సంబంధిత లావాదేవీలకు సంబంధించినవి కాదని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, డీసీఓ నాగసాయికుమార్, ఎంటీఎంసీ అదనపు కమిషనర్ శంకుతల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


