కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి స్పష్టం చేశారు. స్థానిక కృషి భవన్‌లో రాబోవు ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని విత్తన డీలర్లు, ఉత్పత్తిదారులతో శుక్రవారం సాయంత్రం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో అత్యంత కీలకమైన పత్తి, మిరప పంటల సాగుకు సంబంధించి విత్తనాల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. డీలర్లు, ఉత్పత్తిదారులు విత్తనాల నిల్వలను పారదర్శకంగా వెల్లడించాలని సూచించారు. ప్రతి డీలరు తమ వద్ద ఉన్న విత్తన నిల్వలు, విత్తన కంపెనీ, రకాల వారీగా కచ్చితంగా వెల్లడించాలన్నారు. షాపుల వద్ద ప్రతి రోజూ విత్తనాల లభ్యతను తెలిపేలా స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను అక్రమంగా నిల్వ చేస్తే సీడ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంకు ముందే విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామీణ స్థాయిలో రైతు సేవా కేంద్రాలతో సమన్వయం చేసుకుని విత్తన పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. స్టాక్ మూవ్‌మెంట్‌కు సంబంధించిన తాత్కాలిక కాలక్రమ పట్టికను అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. అనధికారిక, నకిలీ విత్తనాల విక్రయం నేరమని, అనుమతి పొందిన సంస్థల నుంచి మాత్రమే విత్తనాలను సేకరించాల్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతుకు విత్తన రకం, కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీతో కూడిన అధికారిక రశీదు ఇవ్వాలని ఆదేశించారు. లూజు విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధమని, ప్యాకెట్లపై స్పష్టమైన లేబుల్స్, సర్టిఫికేషన్ ఉండాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేని బీజీ–3(హెటీ కాటన్) వంటి చట్టవిరుద్ధమైన విత్తనాలను నిల్వ చేసినా, విక్రయించినా చర్యలు తప్పవన్నారు. గుజరాత్, బెంగుళూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనధికారిక విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్సు బృందాలు గోడౌన్లు, మార్కెట్ సెంటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా డీలర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో డీడీఏ ఐ.సునీత, ఏడీఏ ఎన్.మోహన్‌రావు, ఏఓ సునీల్‌కుమార్, విత్తన డీలర్లు, వివిధ విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
డీఏఓ ఎం.పద్మావతి


