నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్‌న్స్ (ఎస్పీ – సంపర్క్) నిర్వహించారు. పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. వారి సమస్యలను ఆలకించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది వృత్తిపై నిబద్ధత, నిజాయతీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు.
తెనాలిటౌన్: రాష్ట్ర నాయీ బ్రాహ్మణుల క్షౌ రశాలలకు 200 యూనిట్లకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కె.రఘురామయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల 200 యూనిట్లలోపు ఉన్న క్షౌ రశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసినట్లు చెప్పారు. బార్బర్ షాపు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆదాయ సర్టిఫికెట్, షాపు ఓనర్ ధృవీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును సబ్‌మీట్ చేయాలని సూచించారు. పట్టణాలలో సంవత్సర ఆదాయం రూ.70 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.60వేలు ఉండాలని జీవో ఉండగా ఇప్పుడు వాటిని సవరిస్తూ బీపీఎల్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి పట్టణాల్లో సంవత్సర ఆదాయం రూ.1,44,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,20,000 ధృవీకరణ పత్రం తీసుకురావాలని విద్యుత్‌శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర సర్టిఫికెట్లు తీసుకుని విద్యుత్ అధికారులకు అందజేయాలని సూచించారు.


