● భారీగా నిల్వలు గుర్తింపు
● డీలర్‌పై 6ఏ కేసు నమోదు
యడ్లపాడు: రేషన్ డీలర్ ఆఽధీనంలో అక్రమంగా సరుకుల నిల్వలు అధికంగా ఉన్నాయంటూ మండలంలోని జాలాది గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జేసీ ఆదేశాల మేరకు జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రసాద్ గురువారం రాత్రి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల రాకతో ఫిర్యాదు దారులు సైతం కలిసి తామే ఫిర్యాదు చేశామని చెప్పడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉన్నట్లు తేలడంతో యడ్లపాడు డీటీ అనురాధకు సరుకుల వివరాలను చూడాలంటూ ఆదేశించి వెళ్లారు. ఇదే విషయంపై శుక్రవారం డీఎస్‌వోను వివరాలు అడగ్గా గ్రామంలోని 16వ రేషన్‌షాపులో ప్రజా పంపిణీ ప్రక్రియ ముగిసిన తర్వాత బియ్యం, జొన్నలు అధిక నిల్వలు ఉన్నందున వారిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిల్వల వివరాలు మండల అధికారుల నుంచి తీసుకోవాలని చెప్పగా, తహసీల్దార్ జెట్టి విజయశ్రీ వాటి పూర్తి వివరాలు తమ వద్దకు రాలేదని శనివారం తెలియజేస్తామంటూ సమాధానమిచ్చారు. అధికారుల తనిఖీల్లో సుమారు 20 క్వింటాళ్ల బియ్యం, 95.50 కేజీ పంచాదార, జొన్నలు కూడా నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.


