మంత్రి లోకేష్ మార్క్ రాజకీయం మాజీ మంత్రి అంబటి ఇంటిపై దాడి చేసిన వారికి టీడీపీలో ఉన్నత పదవులు ఏకంగా పొలిట్ బ్యూరోలోకి గల్లా మాధవి కనపర్తి శ్రీనివాస్, అబ్బురి మల్లికి రాష్ట్ర స్థాయి పోస్టులు రేపు 12 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్న మాజీ మంత్రి అంబటి
రేపు మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు దక్కాయి. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసిన వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా నారా లోకేష్ తన మార్కు రాజకీయాన్ని చూపించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎన్నికల ముందు వరకు పార్టీలోనే లేని వ్యక్తికి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయగానే ఏకంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో పదవి దక్కడం విశేషం. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవికి తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా పదవి దక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇది దాడి చేయించినందుకు బహుమతిగా ఇచ్చినట్లుగా కేడర్ చెబుతోంది. మరోవైపు ఇదే తరహాలో ముందుండి దాడులకు తెగబడిన కనపర్తి శ్రీనివాసరావు, మన్నెం శివనాగమల్లేశ్వరరావు(అబ్బూరి మల్లి)కి పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా చోటు కల్పించారు. జనవరి 31వ తేదీన అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగింది. ఇప్పటివరకు ఈ కేసులో వీరికి నోటీసులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మాజీ కార్పొరేటర్ వేములపల్లి బుజ్జి, మరికొందరు అని కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై బాధితుడు అంబటి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న పేర్లను కనీసం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. సంఘటన జరిగిన 75 రోజులకుపైగా అయిన తర్వాత కూడా వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీనిపై అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించడంతోపాటు జిల్లా ఎస్పీ, డీజీపీలను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన తర్వాత మొక్కుబడిగా ఒక డీఎస్పీని పంపించి అంబటి రాంబాబు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. పోలీసు యంత్రాంగం మొత్తం అక్కడే మోహరించి ఉండగా జరిగిన దాడిపై సుమోటోగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ముందుకు కదలకపోవడం, దాడులకు తెగబడిన వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు దక్కడం చూస్తుంటే ఈ దాడి వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిర్ణయించారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఈ ఏడాది జనవరి 31న తన కార్యాలయంపై, ఇంటిపై విధ్వంసం స్పష్టించి, తనను చంపేందుకు జరిగిన ప్రయత్నంపై, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత తనను హింసించిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు శనివారం నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ 12 గంటలపాటు జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష చేయనున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. ఆయా కేసుల్లో విచారణలో పురోగతి లేకపోవడంతో గత నెల 23న గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను, రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇచ్చినా ఇంతవరకూ పురోగతి లేదని ఆయన విమర్శించారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు మొదలైన దమనకాండ అర్థరాత్రి 12.20కి ముగిసిందని, తనను చంపేందుకు ప్రయత్నించారని అంబటి రాంబాబు అన్నారు. పలుగులు, కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్స్‌తో వచ్చారని ఇంట్లోని మహిళలు, చిన్నారులు భయబ్రాంతులకు గురయ్యారని కార్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారని చెప్పారు. ఆ తర్వాత తనను అరెస్ట్ చేయడం, కోర్టుకి హాజరుపర్చడం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండటం జరిగిందన్నారు. అయితే తన ఇంటిపై, కార్యాలయంపై జరిగిన విధ్వంసం కాండను ప్రపంచమంతా చూశారని, కానీ విధుల్లో ఉన్న పోలీసుల నుంచి మాత్రం యాక్షన్ లేదన్నారు. కనీసం ఇటువంటి దమనకాండపై పోలీసులు సైతం సుమోటో కేసుగా తీసుకోకపోవడం దారుణమన్నారు. దాడులకు తెగబడిన వారిపై, దాడికి గురైన తనపై కూడా ఏడేళ్లల్లోపు శిక్షలు విధించే కేసులు నమోదు చేశారని అన్నారు. అయితే తన ఇంటిపై, కార్యాలయంపై దాడికి పాల్పడిన వారికి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు ఇంతవరకూ నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. ముద్దాయిలకు మద్దతుగా సీఐ ప్రవర్తించారని, దాడికి గురైన తనకు మాత్రం స్టేషన్ బెయిల్ యివ్వలేదని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారని అన్నారు. అదే రోజు రాత్రి 10.40కి నల్లపాడు పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉన్నానని అర్థరాత్రి 2.30కి పైకి తీసుకెళ్లారని అన్నారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ వంశీధర్, పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ సీఐ గంగా వెంకటేశ్వర్లు తనను హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


