వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అడ్డగోలుగా విభజిస్తే ఎంతటి పోరాటానికై నా సిద్ధమని స్పష్టీకరణ 23న డివిజన్ల మ్యాప్ విడుదల చేస్తామని వెల్లడించిన కమిషనర్
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా జరుగుతుందని భావిస్తున్నామని, అశాసీ్త్రయంగా చేస్తే ఎంతటి పోరాటానికై నా సిద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డివిజన్ల పునర్విభజనపై అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గురువారం నగర కమిషనర్ మయూర్ అశోక్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 57 నుంచి 76కు డివిజన్ల పెంపునకు సంబంధించి ఒక మ్యాపు బయటకు వచ్చిందని.. ఇది ఎలా వచ్చిందని కమిషనర్‌ను అడిగామన్నారు. అది అధికారిక మ్యాపు కాదని, ఈ నెల 23వ తేదీన పునర్విభజనకు సంబంధించిన మ్యాపు రిలీజ్ చేస్తామని కమిషనర్ చెప్పారన్నారు. ఆ తరువాత అభ్యంతరాలను స్వీకరిస్తామని.. వాటిలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే దాని ప్రకారం పునర్విభజన ఫైనల్ ప్రక్రియ ఉంటుందని కమిషనర్ సమాధానం ఇచ్చారని అంబటి పేర్కొన్నారు. పునర్విభజన ప్రక్రియ న్యాయబద్ధంగా జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎక్కడైనా అధికార పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగితే ఎంతటి పోరాటానికై నా సిద్ధమవుతామని స్పష్టం చేశారు. పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాలను పరిశీలిస్తుందని చెప్పారు. ఎక్కడైనా నగర ప్రజలకు అభ్యంతరాలు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని కమిషనర్‌కు వివరిస్తామని పేర్కొన్నారు.
అందరినీ భాగస్వాములు చేయాలి
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పునర్విభజన ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కోరామన్నారు. జనాభా ప్రాతిపదికన, సరిహద్దుల ప్రకారం పునర్విభజన జరగాలని తెలిపారు. ఇటీవల వచ్చిన మ్యాపును చూస్తుంటే ఎక్కడో ఉన్న ఏటుకూరును తీసుకొచ్చి నల్లపాడులో, నల్లపాడును తీసుకెళ్లి నల్ల చెరువులో కలిపినట్లు ఉందన్నారు. పునర్విభజనకు సంబంధించిన అన్ని సందేహాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ ప్రక్రియ అంతా రూల్ ప్రకారం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని చెప్పారు. ఎక్కడా రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ వార్డుల పునర్విభజన ప్రక్రియ ఏకపక్షంగా జరగదని, ప్రోసీజర్ ప్రకారమే జరుగుతుందని కమిషనర్ ఇచ్చిన సమాధానం సంతృప్తి ఇచ్చిందన్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్, ఖాళీ స్థలాలు, పార్కులు, గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన ఆస్తులపై చర్చించామని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన మ్యాపు అధికారికంగా రాలేదని.. ప్రజల అభిప్రాయ సేకరణతో ఫైనల్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఉంటుందని కమిషనర్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ జనాభా లెక్కల ప్రకారం జరుగుతుందా? లేదా ఏరియా ప్రతిపాదికన జరుగుతుందా? అని కమిషనర్‌ను అడిగామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పునర్విభజన జరగాలని కోరుకున్నట్లు తెలిపారు.


