గుంటూరు వెస్ట్: జనగణనలో భాగంగా స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో పాల్గొని ఇతరులకు స్ఫూర్తిగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో డీఆర్వో షేక్ ఖాజావలితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణన చేసుకోవాలన్నారు. దాదాపుగా అంతా వాస్తవిక సమాచారాన్ని అందిస్తే దేశానికి మేలు చేసినవారౌతారని తెలిపారు. స్వీయ గణనలో నమోదు చేసే వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయన్నారు. అవి ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియవని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా స్వీయ గణనలో అందించే సమాచారం కారణంగా ఉన్న సంక్షేమ పథకాలను తొలగించడంగాని, కొత్త పథకాలకు సిఫార్సులు చేయడంగాని ఉండవన్నారు. అందుకని ఎటువంటి సమాచారం ఉన్నా నిర్భయంగా అందజేయాలని కోరారు.
ప్రత్యేక కార్యక్రమాలు
కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో భాగంగా గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తొలి కార్యక్రమం ప్రజాప్రతినిధులతో నిర్వహించామని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా అధికారులు, సిబ్బందితోనూ, 18వ తేదీన సెలబ్రటీస్ ప్రముఖులతోను, 26న భారీ స్థాయిలో స్వీయ గణనపై 5కె వాక్ నిర్వహించనున్నామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక పోస్టర్ల ద్వారా స్వీయ గణనపై సమాచారం పొందవచ్చన్నారు. దీనిలో భాగంగా స్వచ్ఛంద సంస్థల సహకారంతోపాటు వివిధ ఎన్జీఓల సాయం కూడా తీసుకుంటామన్నారు. కుటుంబ సభ్యులను, తెలిసిన వారిని కూడా పాల్గొనేలా చూడాలన్నారు.


