జీజీహెచ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేయండి

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

జిల్లా కలెక్టర్‌ ఆదేశం

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గతేడాది సెప్టెంబరులో 61 పోస్టులకు గుంటూరు వైద్య కళాశాల అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రొవిజనల్‌ లిస్టు ప్రకటించకపోవడం, మరో పక్క ఐదు నెలల్లో నోటిఫికేషన్‌ కాలపరిమితి దాటిపోయి రద్దయ్యే అవకాశం ఉండటంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈవిషయాన్ని ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 15న ‘నో.. పిటికేషన్‌’..! శీర్షిక పేరుతో కథనం ప్రచురితమైంది. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్‌ పరిపాలనా అధికారుల మధ్య సమన్వయలోపంతో ఉద్యోగ నియామక ప్రక్రియ జరగడం లేదని ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అంతేకాకుండా గత ఏడాది మార్చిలో 27 ఉద్యోగాలను జీజీహెచ్‌ నాట్కో సెంటర్‌లో భర్తీ చేశారు. ఏడాది పూర్తయినా నేటి వరకు వారికి ఒక్క నెల వేతనం కూడా చెల్లించలేదు. దీనిపై కూడా ‘సాక్షి’ కథనం ప్రచురించింది. కథనంపై జిల్లా కలెక్టర్‌ స్పందించి గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి, జీజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌ చిన్నం సుధారాణిని తన కార్యాలయానికి పిలిపించి నియామక ప్రక్రియ జాప్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. వేతనాలు చెల్లించకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, తక్షణమే వేతనాలు చెల్లించేలా, ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement