న్యూస్‌రీల్
గురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో అన్నదాతలు కుదేలు
● సాధారణ సాగు కంటే భారీగా పెరిగిన విస్తీర్ణం
● గిట్టుబాటు ధర దక్కక రూ.800–
రూ.900 వరకు నష్టపోతున్న రైతులు
● జిల్లాలో మచ్చుకైనా ఏర్పాటు కాని
కొనుగోలు కేంద్రాలు
● అన్నదాతల కష్టాలపై
స్పందించని చంద్రబాబు ప్రభుత్వం
● పక్క రాష్ట్రంలో మద్దతు
ధరతో జోరుగా కొనుగోళ్లు
● ఇక్కడ మాత్రం కర్షకులకు
తప్పని కన్నీటి వెతలు
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్‌లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం కాస్త కూడా వారిపై జాలి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారుల దెబ్బకు తీవ్రంగా నష్టపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ కొరిటెపాడు: మొక్కజొన్న సాగు రోజురోజుకూ భారంగా మారుతోంది. పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోతుండగా, మార్కెట్‌లో లభిస్తున్న ధరలు మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తున్నాయి. పంట పండించడమే కష్టం, అమ్ముకోవడం మరింత కష్టం అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. సర్కార్ దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు.
మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400 ఉంది. అయితే మార్కెట్‌లో రూ.1,500 నుంచి రూ.1,700 వరకే దక్కుతోంది. మద్దతు ధరకు, మార్కెట్‌లో లభించే ధరకు రూ.200 నుంచి రూ.300 వరకు తేడా ఉంటే రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. కానీ మద్దతు ధరకు, మార్కెట్‌లో లభించే ధరకు వ్యత్యాసం రూ.900 వరకు ఉండటం వల్ల రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 2025–26 రబీ సీజన్‌లో గుంటూరు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 50,835 ఎకరాలు. కానీ 79,202.5 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట సాగు చేశారు. జిల్లాలో దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, కొల్లిపర, చేబ్రోలు, కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో మొక్క జొన్న సాగు అధికంగా ఉంది. మిగిలిన మండలాల్లో అరకొరగా సాగు చేశారు. మొక్కజొన్న సాగులో కౌలు రైతులే అధికంగా ఉన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు రైతన్నా మీ కోసం అంటూ కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నకు ధర పడిపోయిందని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా చూడాలని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఎంత మొత్తుకున్నా.. ఇలా కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. కష్టకాలంలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2,400 ప్రకారం కొనుగోలు చేస్తోంది. ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉంది. ఆదుకోవాలని రైతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే మొక్కజొన్న సాగు తగ్గిపోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గుంటూరు జిల్లాలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం 50,835 ఎకరాలు కాగా, రైతులు 79,202.5 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు 38 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, అంతర సేద్యం, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, కోత, నూర్పిడి తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు సుమారు రూ.50 వేలకుపైగానే రైతులు ఖర్చు చేశారు. అన్నీ సక్రమంగా ఉంటే ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి రావాలి. ఈ ఏడాది ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లలోపే దిగుబడి ఉందంటున్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.2,400 గా ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో బయట మార్కెట్‌లో దళారులు క్వింటా రూ.1,500 నుంచి రూ.1,700 కే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలకు విక్రయిస్తే భారీగా అప్పులు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఉంది. రూ.2,400 లెక్కన కొనుగోలు చేస్తే మిగులు లేకపోయినా కనీసం పెట్టుబడి, చాకిరి ఖర్చు అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం గుంటూరు జిల్లాలో సుమారు 3.01 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఒక్కో ఎకరాకు రూ.వేలు పెట్టుబడి పెట్టి రాత్రింబవళ్లు కష్టపడి పండించిన రైతులు మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారు.


