ఇంటర్‌లో మూడోసారీ అద్వితీయం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో మూడోసారీ అద్వితీయం

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

ఇంటర్‌లో మూడోసారీ అద్వితీయం

ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో రెండోస్థానం కై వసం

సీనియర్‌ ఇంటర్లో గతేడాది

కంటే తగ్గిన ఉత్తీర్ణత

జూనియర్‌ ఇంటర్‌లో 82 నుంచి

86.02 శాతానికి పెరుగుదల

రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు

సాధించిన విద్యార్థులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో

సత్తా చాటిన బాలలు

గుంటూరు ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లా ద్వితీయస్థానంలో హ్యాట్రిక్‌ విజయం సాధించింది. వరుసగా మూడేళ్లపాటు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్ధానంలో నిలిచింది. బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలతో పాటు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.

సీనియర్‌ ఇంటర్‌ డల్‌...

సీనియర్‌ ఇంటర్‌ జనరల్‌ కోర్సుల పరీక్ష ఫలితాల్లో గత ఏడాది 91 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం అది 86.31 శాతానికి పరిమితమైంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌, ఎయిడెడ్‌ సాంఘిక సంక్షేమ హైస్కూల్‌ ప్లస్‌ జూనియర్‌ కళాశాలలవారీగా పరీక్షలు రాసిన 31,116 మంది విద్యార్థుల్లో 26,856 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 14,611 మంది హాజరు కాగా, 12,940 మంది ఉత్తీర్ణులయ్యారు. 88.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా బాలురు 16,505 మంది పరీక్ష రాయగా, 13,916 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురను అధిగమించి బాలికలు పైచేయి సాధించారు.

జూనియర్‌ ఇంటర్‌లో జోష్‌

జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో గత ఏడాది 82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రస్తుతం అది 86.2 శాతానికి చేరింది. పరీక్షలు రాసిన 34,329 మంది విద్యార్థుల్లో 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 15,760 మంది పరీక్షలు రాయగా, వారిలో 13,861 మంది ఉత్తీర్ణులయ్యారు. 87.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 18,569 మందిలో 15,669 మంది ఉత్తీర్ణులయ్యారు. 84.38 శాతంగా నమోదైంది. బాలికలే పై చేయి సాధించారు.

ఓకేషనల్‌ కో ర్సుల్లో ఉత్తీర్ణత

ఒకేషనల్‌ విభాగంలో సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు రాసిన 1076 మంది విద్యార్థుల్లో 626 మంది ఉత్తీర్ణులై 58.18 శాతంగా నమోదైంది. ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన 1157 మంది విద్యార్థుల్లో 530 మంది ఉత్తీర్ణులై 45.81 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల సత్తా

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. గత ప్రభుత్వంలో సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలోని జెడ్పీ హైస్కూల్‌ నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు అత్యధిక ఉత్తీర్ణత సాధించారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో షేక్‌ రషీదా 958, గంజరబోయిన కీర్తన 945 మార్కులు కై వసం చేసుకున్నారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో గాలి హూమైలా 463, ఆలా వాహిని యాదవ్‌ 435, బురదగుంట దీపిక రేణు 420 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు ఆలా తరుణి 429 కై వసం చేసుకుంది.

బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచారు.

● సీనియర్‌ ఇంటర్‌ బైపీసీ విభాగంలో బి.సాయిహర్షిత అత్యధికంగా 992 మార్కులు సాధించింది. అదేవిధంగా డి.కృష్ణపూజిత 991, బి.పూజిత 990, ఎం.డి.సఫా సకీనా 990 మార్కులు సాధించారు.

● జూనియర్‌ ఇంటర్‌ బైపీసీ విభాగంలో 455 మార్కులకు టి.దుర్గా గీతిక అత్యధికంగా 452 మార్కులు సాధించింది. అదేవిధంగా 451 మార్కులు సాధించిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు.

● సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో జి.ఎన్‌.వి.పవన్‌కుమార్‌, బి.దినేష్‌కుమార్‌, బి.సాయి సాత్విక్‌, జి.విష్ణువర్ధన్‌ వరుసగా నలుగురు విద్యార్థులు వెయ్యికి 990 మార్కులు సాధించారు.

● జూనియర్‌ ఎంపీసీ విభాగంలో విద్యార్థిని ఎన్‌.ఆశ్రేష 470కి 467 మార్కులు సాధించింది. 466 మార్కులు సాధించిన విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement