తెనాలిలో ఎన్‌క్వాస్‌ బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

తెనాలిలో ఎన్‌క్వాస్‌ బృందం పర్యటన

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

తెనాలిలో ఎన్‌క్వాస్‌ బృందం పర్యటన నిజాంపట్నం కోస్టల్‌గార్డ్‌ కమాండెంట్‌గా సాంకేత్‌మిశ్రా కోర్టు ధిక్కరణ కింద జరిమానా

తెనాలిఅర్బన్‌: నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్‌ బృందం తెనాలి నందులపేటలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను బుధవారం తనిఖీ చేసింది. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సభ్యులు ఆరా తీశారు. వైద్యశాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎన్‌క్వాస్‌ సభ్యులు డాక్టర్‌ అనోజ్‌, డాక్టర్‌ రవీషా, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్నపూర్ణ, డీపీఎంవో శ్యామ్‌, జిల్లా కన్సల్టెంట్లు వాసు, మాధవి, డాక్టర్‌ తేజస్విని, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆసియా, ఎంపీహెచ్‌ఈవో ఉమాకాంత్‌, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల: నిజాంపట్నం కోస్టల్‌ గార్డ్‌ కమాండెంట్‌గా సాంకేత్‌ మిశ్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అనంతర జ్ఞాపికను ప్రదానం చేశారు. కోస్తా తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు.

దుర్గమ్మకు రూ.2.69 కోట్ల

హుండీ ఆదాయం

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్‌ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్‌ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్‌ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్‌, 180 థాయిలాండ్‌ బాత్స్‌, 200 ఓమన్‌ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్‌టౌన్‌ పోలీసులు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు.

గుంటూరు లీగల్‌: కోర్టు ధిక్కరణ కింద ఓ మహిళకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి రూ. 200 జరిమానా, లేకుంటే 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు విచారణ నిమిత్తం ప్రధాన జిల్లా కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ సమయంలో ఈ కేసులో సాక్షిగా ఉన్న గుంటూరు నగరం వసంతరాయపురానికి చెందిన కొఠారి పావని సాక్ష్యం చెప్పటానికి వచ్చింది. సాక్ష్యం చెప్పే క్రమంలో కోర్టు విధివిధానాలను ధిక్కరిస్తూ న్యాయమూర్తి ఎదుట ధిక్కారంగా మాట్లాడింది. దీంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement