సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతిలో ఆయుధంగా పోలీసు వ్యవస్థ మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం 18న గుంటూరు కలెక్టరేట్ వద్ద 12 గంటల నిరసన నిరాహార దీక్ష
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్‌కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం అక్రమ కేసులు బనాయించి వేధించడం దుర్మార్గమన్నారు. ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి ప్రకటించారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.


